- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ పంచాయతీలకు షాక్.. ఏకగ్రీవం..అందని ప్రోత్సాహకం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేక పోయింది.

ఏకగ్రీవం..అందని ప్రోత్సాహకం
-పాలకవర్గాలు వచ్చి మూడు
నెలలైనా కరువు..
- నజరానా కోసం ఎదురుచూపులు
- ప్రోత్సాహక నిధులతో
గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు
దిశ, కామారెడ్డి : ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ పరంగా 10 లక్షల నగదు ప్రోత్సాహంతో పాటు కొంతమంది మంత్రులు కూడా తమ నిధుల నుంచి ఏకగ్రీవ పంచాయతీలకు అదనంగా మరో 10 లక్షల రూపాయల నజరానా అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలతో గ్రామ అభివృద్ధికి 20 లక్షల రూపాయలు రావడంతో పాటు ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా పంచాయతీ పాలకవర్గాన్ని ఎన్నుకోవచ్చనే ఉద్దేశంతో జిల్లాలో చాలా గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క ఏకగ్రీవ గ్రామ పంచాయతీకి కూడా ప్రోత్సాహం అందలేదు.
గత ప్రభుత్వం మాదిరేనా...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేక పోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రూపాయల ప్రోత్సాహంతో పాటు మంత్రుల నిధుల నుంచి మరో 10 లక్షల రూపాయలు అదనంగా ఇస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. అయితే అవి మంత్రుల అభివృద్ధి నిధుల కోటా నుంచి ఇస్తారా లేదంటే ప్రభుత్వం ప్రత్యేక కోటా నుంచి ఇస్తుందా అన్నది వెల్లడించలేకపోయారు.
ప్రజల్లో ఐక్యత పెంపొందించేందుకే..
ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకే ఏకగ్రీవ పంచాయతీలను ఎన్నుకుంటే ఆ పంచాయతీలకు ప్రోత్సాహంగా 5 లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పారితోషికం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ప్రజా ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇచ్చిన హామీని నెరవేరుస్తుందని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే పంచాయతీ పాలకవర్గాలు పదవులు అలంకరించి మూడు నెలలు గడిచిపోతున్నప్పటికీ ప్రభుత్వం తోపాటు మంత్రులు ఇస్తామన్న పారితోషికం ఇప్పటివరకు ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రోత్సాహక నిధులతో అభివృద్ధి పనులు..
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక నిధులు వస్తే గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు రోడ్ల మరమ్మతులు తాగు నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసుకోవచ్చనే ఆశతో ఉన్నారు. జిల్లాలో అధికంగా గిరిజన పంచాయతీలతో పాటు చిన్న గ్రామపంచాయతీలు అధికంగా ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీలు ప్రత్యేకంగా కేటాయించే నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించుకోవచ్చనే ఆశతో ఆ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇస్తామన్న ప్రోత్సాహకాలు వెంటనే అందజేసి ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.






