రోడ్డు భద్రత సామాజిక బాధ్యత - నిర్లక్ష్యాన్ని విడాలి ప్రాణాలను కాపాడాలి

by Ratna Kumari |

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని, నిర్లక్ష్యాన్ని వీడి ప్రాణాలను కాపాడుకుందామని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత - నిర్లక్ష్యాన్ని విడాలి ప్రాణాలను కాపాడాలి
X

దిశ, కామారెడ్డి టౌన్ : రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని, నిర్లక్ష్యాన్ని వీడి ప్రాణాలను కాపాడుకుందామని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి కలాభారతిలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్య‌క్ర‌మానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీజీపీ ఎన్‌హెచ్-44 పై కుప్రియల్ ఎక్స్ రోడ్ సమీపంలోని రోడ్డు ప్రమాద హాట్‌స్పాట్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. గత మూడు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో 12 రోడ్డు ప్రమాదాలు జరిగి 12 మంది మృతి చెందగా.. 5 మంది గాయపడ్డారు. ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

హత్యల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలు

తెలంగాణలో ఏటా సుమారు 800 మంది హత్యల వల్ల మరణిస్తుంటే.. 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హత్యల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యమేనని తెలిపారు.

పాటించాల్సిన నిబంధనలు

ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి.

కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి.

డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలి, ముందున్న వాహనంతో 2-3 సెకండ్ల సురక్షిత దూరం ఉంచాలి.

“నాకు డ్రైవింగ్ బాగా తెలుసు” అనే అతివిశ్వాసం ప్రమాదకరం.

అవగాహన కార్యక్రమాలు

ఏప్రిల్ 13 నుండి 18 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన వల్ల జరిగే ప్రమాదాలపై నాటికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 300 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ట్రక్కులు, లారీలు నడిపే 161 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోడ్లు అందజేశారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద భద్రతా చర్యలతో 2025లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ వెల్లడించారు.

50 మందిని రక్షించిన వ్యక్తికి సన్మానం

50 మందిని రక్షించిన వంకాయల రవి ని డీజీపీ చేతుల మీదుగా సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఇంటి నుంచి బయలుదేరిన వారు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకుంటారని తెలిపారు. “ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. సమాజంలో ప్రమాదాలను అరికడదాం” అని పిలుపునిచ్చారు.

Next Story