మద్నూర్‌లో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందా..

by Kodari Anjali |

మద్నూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మద్నూర్‌లో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందా..
X

దిశ,​ మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మండలంలోని నాలుగు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ముక్కుపిండి వసూలు చేస్తున్న అధిక ఫీజులు సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులకు తీవ్ర తలనొప్పిగా మారాయి. తాజాగా ఇదే అంశంపై మద్నూర్ లో నిర్వహించిన గ్రామసభలో మండల విద్యాధికారికి స్థానికుల నుంచి గట్టి చుక్కెదురైంది. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై గ్రామస్థులు, తల్లిదండ్రులు ఏకంగా అధికారిని నిలదీసిన వ్యవహారం ఇప్పుడు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

​ఫీజుల పేరిట జేబులకు చిల్లులు..

​మండలంలోని సదరు నాలుగు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ,అడ్మిషన్ల పేరిట, డొనేషన్ల పేరిట వేల రూపాయలు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫారాలు సైతం పాఠశాలల్లోనే అధిక ధరలకు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి నాలి చేసుకునే పేదలు సైతం పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ బాట పడితే, యాజమాన్యాల దందా వారిని అప్పులపాలు చేస్తోందని గ్రామసభలో ధ్వజమెత్తారు.

​అధికారిని ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రశ్నల వర్షం

​మద్నూర్ లో జరిగిన గ్రామసభకు హాజరైన మండల విద్యాధికారి కి విద్యావ్యవస్థపై స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రైవేట్ పాఠశాలలు ఇంతలా దోచుకుంటుంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు..? కంటితుడుపు తనిఖీలతో సరిపెడుతున్నారా...? అంటూ నిలదీశారు. అధికారుల ఉదాసీనత వల్లే ప్రైవేట్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో కాసేపు తీవ్ర ఉద్రిక్తత, చర్చనీయాంశ వాతావరణం నెలకొంది.

​కళ్లెం వేస్తారా.. చూసీచూడనట్లు వదిలేస్తారా..?

​గ్రామసభలో ప్రజల ఆగ్రహానికి గురైన ఎంఈఓ.. ఈ అడ్డగోలు ఫీజుల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఫీజుల నియంత్రణకు కళ్లెం వేస్తారా? లేక ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిళ్లకు, ‘మామూళ్ల’ మత్తుకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తారా? అనేది వేచి చూడాలి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, మద్నూర్ ప్రైవేట్ పాఠశాలలపై విచారణ జరిపి, ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Next Story