67 పోస్టుల జాబితా పై అభ్యర్థుల అభ్యంతరాలు..

by Disha Web Desk 20 |
67 పోస్టుల జాబితా పై అభ్యర్థుల అభ్యంతరాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎం తుది జాబితా పై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. 2021 సెప్టెంబర్ లో నిజామాబాద్ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ కింద 67 ఏఎన్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది కాలంగా సంబంధిత పోస్టుల తుది జాబితా కోసం ఎదురుచూశారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎం అర్హతతో దరఖాస్తు చేసుకున్న వారిలో సెలక్షన్ లిస్టు జాబితా ఏర్పాటుకు ఏడాది కాలం పట్టడంతో విమర్శలు వస్తున్నాయి. గత కలెక్టర్ హయంలో వెలువడాల్సిన జాబితా కొత్త కలెక్టర్ సంతకంతో ఈ నెల 1న విడుదల చేశారు. మొన్నటి వరకు 64 పోస్టుల జాబితాను విడుదల చేసిన అధికారులు ఏకంగా 27 పోస్టుల జాబితాను విడుదల చేయడంతో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో 2021లో విడుదల చేసిన జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద దరఖాస్తు చేసిన ఏఎన్ఎం పోస్టుల భర్తీలో పైరవీలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీల కారణంగానే దాదాపు 19 నెలలు ఆలస్యంగా పోస్టుల భర్తీ సెలక్షన్ లిస్టు ప్రకటించారని ఆరోపణలున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ట్రంలోని అన్నీ జిల్లాలో 2022లో ఎంపిక జరిగి చాలా మంది ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తుంటే ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఆయా పోస్టుల భర్తీ ఆలస్యం వెనుక పెద్దతలకాయల పైరవీలే కారణమనే వాదనలు ఉన్నాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేటర్ లు ఇవ్వడంతో తుది జాబితా ప్రకటనకు కాలయాపన జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కేవలం తాత్కాలిక పద్దతిన (ఔట్ సోర్సింగ్ పద్దతిన) భర్తీ చేసే వైద్య ఆరోగ్యశాఖాధికారులపై ఒత్తిడి ఉండడంతో వారు తుది జాబితా ప్రకటనకు ఆలస్యం చేశారని వాదనలు ఉన్నాయి. దాదాపు రెండేళ్ల కాలయాపనతో నిరుద్యోగులు నష్టపోయారని వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్ హెచ్ఎన్ కింద 67 ఔట్ సోర్సింగ్ పోస్టుల తుది జాబితాలో పొరపాట్లు జరిగాయని, అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మొదటి జాబితాలో పేర్లు వచ్చిన దరఖాస్తుదారులు తరలివచ్చారు. అక్కడ అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తో వాగ్వివాదానికి దిగారు. వారికి పీడీఎస్ యూ విద్యార్థి సంఘం మద్దతు పలికింది. ఏఎన్ఎం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, 64 మందితో తొలి జాబితా, రెండవ జాబితా విడుదల చేశారని మళ్లీ ఈ విషయంలో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ కు, డీఎంహెచ్ వోకు ఫిర్యాదు చేస్తే ఇంకా జాబితా ఫైనల్ కాలేదని, మరో జాబితా పెడుతామని హామీ ఇచ్చారని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ అన్నారు.

Next Story

Most Viewed