పోర్స్చే కారుతో బైకును ఢీకొట్టిన మైనర్.. ఇద్దరు మృతి

by Harish |
పోర్స్చే కారుతో బైకును ఢీకొట్టిన మైనర్.. ఇద్దరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆదివారం అర్ధరాత్రి ఒక మైనర్ లగ్జరీ కారు పోర్స్చేను వేగంగా డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం పూణేలోని కళ్యాణి నగర్‌లో తెల్లవారుజామున 3.15 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని అనీష్ అవడియా, అశ్విని కోస్టాగా గుర్తించారు. వారు క్లబ్‌లో పార్టీ చేసుకుని స్నేహితులతో కలిసి మోటార్‌సైకిళ్లపై ఇంటికి తిరిగి వస్తుండగా కళ్యాణి నగర్ జంక్షన్ వద్ద పోర్స్చే కారును వేదాంత్ అగర్వాల్ (17) అనే మైనర్ వేగంగా నడుపుకుంటూ వచ్చి వారి బైక్‌ను ఢీకొట్టడంతో ఆ ఇద్దరు గాల్లోకి ఎగిరి కారుపై పడ్డారు, తీవ్ర గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ఢీకొట్టిన తరువాత కారు రోడ్డు ప్రక్కన ఉన్న రెయిలింగ్‌పై దూసుకెళ్లి ఆగింది.

ప్రమాదం తరువాత కారు నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానికులు డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. నిందితుడు మైనర్ అయిన వేదాంత్ అగర్వాల్ పూణే నగరానికి చెందిన ఓ బిల్డర్ కుమారుడిగా గుర్తించారు. అతనిపై పోలీసులు ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో 279 (ర్యాష్ డ్రైవింగ్), 304A (నిర్లక్ష్యం వల్ల మరణం), 337 (మానవ ప్రాణాలకు హాని కలిగించడం), 338 (తీవ్రమైన గాయం కలిగించడం), మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story