వరి సాగుతో భూముల్లో తగ్గుతున్న పోషకాలు..ఎందుకో తెలుసా..

by Disha Web Desk 20 |
వరి సాగుతో భూముల్లో తగ్గుతున్న పోషకాలు..ఎందుకో తెలుసా..
X

దిశ, కామారెడ్డి రూరల్ : ఒకే రకమైన వరి పంటను ప్రతి యేడు సాగుచేయడం వల్ల భూముల్లో పోషకాలు తగ్గి దిగుబడులు రాక రైతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి అన్నారు. పంటల మార్పిడి విధానంతో భూములు సారవంతం కావడంతో పాటు రైతులకు సిరులు పండే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మహిళా కిసాన్ దివస్ ను పురస్కరించుకొని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శనివారం గ్రామీణ రైతులకు చిరుధాన్యాల సాగు, పోషక విలువల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఆహార ధాన్యాల కన్నా చిరుధాన్యాలలో పోషకాల స్థాయి ఎక్కువగా ఉంటుందన్నారు. మెట్టతో పాటు నీటి పారుదల సరిగ్గా లేని ప్రాంతాలలో ఈ చిరుధాన్యాల పంటలను పండించడం వల్ల రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అన్నారు. రోజు చిరుధాన్యాల ఆహార పదార్థాలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. కామారెడ్డి సహాయ వ్యవసాయ సంచాలకులు అపర్ణ మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు సులభంగా చేసుకోవచ్చని, ముఖ్యంగా ఆహార పంటలైన రాగులు, జొన్నలు, కొర్రలు , సామలు , అరికెలు , మొదలైన పంటల్ని సాగు చేయవచ్చన్నారు. అలాగే ఈ పంటలతో విలువ ఆధారిత ఉత్పత్తుల్ని చేయడం వల్ల అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం రుద్రుర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ చిరుధాన్యాలు వాటి ఉపయోగాల గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయంలో ఉత్తమ మహిళా రైతులను సత్కరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు భారతి, ఎల్లారెడ్డి వ్యవసాయ సంచాలకులు రత్న, చిన్నమల్లారెడ్డి సర్పంచ్ కృష్ణజ్జిగారి రత్న భాయి ఆనంద్ రావు, చిన్నమల్లారెడ్డి రైతుబందు సమితి అధ్యక్షుడు బాయికాడి విఠల్ రావు, ఆత్మ కమిటీ మెంబర్ బాయికాడి ఆనంద్ రావు, జిల్లా మహిళా రైతులు, వ్యవసాయ అధికారులు సునీత, పవన్ కుమార్, జ్యోత్స్న, ప్రియదర్శిని, శ్రీనివాస రావు , మహిళా వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆత్మ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed