రైతు భరోసాతో ప్రజాధనం దుర్వినియోగం.. సర్కార్ ఆదేశాలు బేఖాతరు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు పథకం పేరు మారింది.

రైతు భరోసాతో ప్రజాధనం దుర్వినియోగం.. సర్కార్ ఆదేశాలు బేఖాతరు
X

దిశ, మాచారెడ్డి: రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు పథకం పేరు మారింది. ప్రజాధనం దుర్వినియోగం మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నట్లే, ఈ ప్రభుత్వంలోనూ జరుగుతోంది. రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు చేస్తే, ఈ ప్రభుత్వం రైతుభరోసా పేరుతో చేస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలు చేసేది ఒక్కటే పని. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు, నివాస స్థలాలకు రైతు భరోసా అందడం ఆగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుట్టలకు, వెంచర్లకు, నివాస స్థలాలకు, బంజరు భూములకు కూడా రైతుబంధు ఇచ్చి వేలాది కోట్లు దుర్వినియోగం చేసిందని గత ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేసింది. రైతుబంధు పేరుతో జరిగి ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపించింది. వ్యవసాయ భూములు, వ్యవసాయ యోగ్యంగా లేని భూములను సర్వేలో గుర్తించి వాటిక రైతుభరోసా ఇవ్వబోయేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సర్వేను పారదర్శకంగా చేపట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేశామని చాలా గొప్పగా చెప్పుకుంది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో రైతుభరోసా దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెపుతూ వస్తోంది. కానీ, ప్రభుత్వ చెపుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో రైతుభరోసా పేరుతో ప్రజాధనం దుర్వినియోగం కావడానికి పొంతనే లేదని తెలుస్తోంది. రాళ్లు రప్పలు, వ్యవసాయానికి పనికిరాని భూములు, వెంచర్లు, లేఅవుట్ ప్లాట్లు, నివాస ప్రాంతాలకు చెందిన భూములను వ్యవసాయ భూములుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో పొందుపరిచి అందరికీ రైతుబంధు పథకాన్ని వర్తింపజేసి ప్రజాధనాన్ని వేల కోట్లలో దుర్వినియోగం చేసింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను రద్దు చేయడంతో పాటు,రైతుబంధు ను పేరుమార్చి రైతు భరోసాగా కొనసాగిస్తోంది.

వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయాన్ని అందిస్తామని, దానికి సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేసింది. స్థానిక రెవిన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసి రైతు భరోసాను ఇప్పటికీ అనర్హులకు వర్తింపజేస్తున్నారు. రైతు భరోసా అమలు చేసిన క్రమంలో వ్యవసాయ, రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్లాట్లుగా మారిన, లేఅవుట్లు చేసిన, ఇండ్లు నిర్మించిన భూములను గుర్తించి రెవిన్యూ రికార్డుల నుంచి తొలగించాల్సి ఉన్నప్పటికీ ఆయా శాఖల అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగా పాత రికార్డులను ఇంకా అలాగే కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో దుర్వినియోగమైనట్లుగానే ఈ ప్రభుత్వ హయాంలోనూ రైతుభరోసా నిధులు పబ్లిక్ గా దుర్వినియోగమవుతున్నాయి. ప్రజాధనాన్ని మరోసారి దుర్వినియోగపరచారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రమైన గజ్యా నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్లు 272, 273, 268‌, 332, 333 లలో ప్లాట్లు, నివాసాలు, వెంచర్లు వెలిశాయి. వీటి క్రయవిక్రయాలలో గుంటల లెక్కన విక్రయించి పట్టా పాస్ బుక్కులు పొందారు. మరికొన్ని ప్లాట్లకు సంబంధించి ఓనర్ షిప్ సర్టిఫికెట్లు పొంది సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్లు చేసుకున్నారు. సర్వేనెం. 268 లోని పూర్తి విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అయినప్పటికీ ఈ భూమికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం డబ్బులు వారి వారి ఖాతాల్లో జమవుతున్నాయి.

డబుల్ రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు

ఎప్పుడో విక్రయించుకున్న భూములు ధరణి పుణ్యమా అని వారి పేర్లపై పట్టా బుక్కులు జారీ అయ్యాయి. దీంతో సర్వే నెం. 268 లో ఎలాంటి నిర్మాణం జరిగినా అది మా భూమి అంటూ పాస్ బుక్కులు చూపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇండ్లు నిర్మించుకునేవారు స్థానికుల సాయంతో మధ్యవర్తిత్వం కుదుర్చుకొని డబుల్ రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు చేసుకొని ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఓ పక్క పట్టా పాస్ బుక్కు ద్వారా రైతు భరోసా డబ్బులు పొందడమే కాకుండా, మరో పక్క ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల సమన్వయంలోపం కారణంగా సామాన్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అయినప్పటికీ వారికి సరైన లేఅవుట్ డాక్యుమెంట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవిన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్లాట్లుగా మారిన పట్టా భూములను రెవిన్యూ రికార్డుల నుంచి తొలగించాలని, రైతుభరోసా పేరుతో జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story