- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం
పెరిగిన స్టీలు, సిమెంట్, ఇసుక ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులపై భారం పడుతోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెరిగిన స్టీలు, సిమెంట్, ఇసుక ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, కూలీ రేట్లు సైతం పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కొక్క ఇంటిపై అదనపు భారం పడేలా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఓ సాధారణ కుటుంబం సొంతింటిని నిర్మించుకోవాలంటే భయం వేసే పరిస్థితులు నెలకొన్నాయి. కాయ కష్టం చేసిన దినసరి కూలీ కుటుంబాలు, చిరుద్యోగులు, వేతన జీవు లు, సొంతిల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నా ఎన్నో కుటుంబాలు అంద కుండా పెరిగిన ఇంటి నిర్మాణ అంచనా వ్యయాన్ని చూసి దడుచుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకమేననే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దారిద్ర్య రేఖకు అడుగున ఉన్న పేద, బడుగు బలహీన వర్గాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట గృహనిర్మాణ పథకాన్ని అమలు చేస్తోంది.
ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షల ఆర్థిక సాయం
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న లబ్దిదారుడికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. నియోజకవర్గానికి 3,500 వేల చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్‌లను మంజూరు చేసింది. వాటి నిర్మాణం పనులు జిల్లాలో చురుగ్గా కొనసాగుతున్నాయి. విడతల వారీగా లబ్దిదారులకు డబ్బులు కూడా అందుతున్నాయి. జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా అంతటా ప్రారంభం కావడం, నిర్ణీత వ్యవధిలోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రభుత్వ సాయాన్ని పూర్తి స్థాయిలో పొందేందుకు లబ్దిదారులు ఉత్సాహంగా ముందుకెళుతున్నారు. ఈ దశలో జిల్లాలో ఉత్పత్తయ్యే ఇటుకల సంఖ్య ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్‌లతో పాటు ప్రజలు వారి సొంత నిధులతో నిర్మించుకుంటున్న భవనాలకు సరిపోయే స్థాయిలో ఇటుకల తయారీ జరగడం లేదు.
డిమాండ్ ఎక్కువ.. ప్రొడక్షన్ తక్కువ
మార్కెట్ లో ఇటుకల డిమాండ్ ఎక్కువగా ఉండటం.. ప్రొడక్షన్ తక్కువగా ఉండటంతో ఇటుకలకు ఎక్కడా లేని గిరాకి పెరిగింది. దీంతో ఇటుకల తయారీదారులు ఒక్కసారిగా ట్రాక్టర్ లోడ్ (2000 ఇటుకలు) ఇటుకలకు రూ. 17 వేలు ఆపైన ధర డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ ధర రూ. 11 వేల నుండి రూ. 12 వేల వరకు ఉండేదని, ఇప్పుడు అడ్డూఅదుపూ లేకుండా పెంచేశారని జనాలంటున్నారు. కూలీలు కూడా రోజుకు రూ. 600 లు కూలీ ఇస్తే వచ్చే వారు ఇప్పుడు రూ. 1000 లు అడుగుతున్నారని, మేస్త్రీలకైతే రూ. 1200 ల నుండి రూ. 1500 లు డిమాండ్ చేస్తున్నట్లు చెపుతున్నారు. మేస్త్రీల డిమాండ్ కూడా పెరగడంతో గతంలో రోజు వారీ కూలీ డబ్బులకు పని చేసేవారు కూడా ఇప్పుడు వర్క్ కాంట్రాక్టు ఇస్తేనే చేస్తామని కండీషన్ లు పెడుతున్నారు. వీరిని కాదని వేరే మేస్త్రీలను అడిగినా అందరూ కూడబలుపుకుని మార్కెట్లో మేస్త్రీలు, లేబర్ల కృత్రిమ కొరత సృష్టించి వారు అడిగినంత ఇచ్చే లా చేసుకుంటున్నారని జనం వాపోతున్నారు. స్‌థానికంగా ఇటుకలు సకాలంలో దొరకకపోవడంతో మహారాష్ట్ర నుండి అధిక ధరలు చెల్లించి లైట్ వెయిట్ ఇటుకలను స్థానిక ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు.
ఇసుక ధరలకు కూడా రెక్కలొచ్చాయి..
ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైనంత ఇసుకను ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఇసుక వ్యాపారులు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వాగులోని ఇసుకను అడ్డగోలుగా తవ్వుతూ వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇసుక రీచ్ లు ఉన్న గ్రామాల్లోకి ఇసుకను తరలించాలన్నా కనీసం రూ.3వేలకు తక్కువ కాకుండా అమ్ముకుంటున్నారు. గతంలో రూ.1200లు నుంచి రూ. 1500 ల లోపు ట్రాక్టర్ ట్రిప్పు ఇసుక వచ్చేది కూడా ఇప్పుడు రూ. 2,500ల నుంచి రూ.3వేలు ఆపై వరకు ధరలు పెంచేశారు. దూరాన్ని బట్టి ఈ ధర ఇంకా పెరుగుతుంది. ట్రాక్టర్ ట్రిప్పు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు కూడా అమ్ముకుంటున్నారు.
సిమెంట్ బస్తా ధర.330ల నుంచి రూ.350ల వరకు పలుకుతోంది. సిమెంట్ ధరతో పాటు గృహనిర్మాణానికి అవసరమయ్యే అన్ని ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని గృహనిర్మాణదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ ధరలను తగ్గించేందుకు, ధరలను నియంత్రణలో ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్యుడు భారీగా నష్టపోతున్నాడని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.






