- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరులో హైటెక్ వ్యభిచారం
40 ఇళ్లు.. 20 మంది సహాయకులు..కోడింగ్ భాషలో రూ.కోట్లలో వ్యాపారం.సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్న మాఫియా. పోలీసుల దాడులతో జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార సామ్రాజ్యం విస్తరించింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసుల దాడులతో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు దొరకడం విస్మయానికి గురిచేస్తుంది. పోలీసులు నిత్యం గస్తీ నిర్వహించే అశోక్ టాకీస్ వంటి రద్దీ ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉండే మర్లు, బైపాస్ రోడ్డు ప్రాంతాలను కూడా తమ అడ్డాలుగా మార్చుకున్న సదరు వ్యక్తులు వేలాది మంది విటులతో ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు సమాచారం.
మూడంచెల భద్రత.. కోడింగ్ భాష!
నిర్వాహకుడు తన చుట్టూ 20 మంది అనుచరులతో ఒక ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఎవరికీ అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు అద్దె ఇళ్లను మారుస్తూ (సుమారు 40 ఇళ్లు) దందాను గుట్టుగా నడిపిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలను విటులకు పంపిస్తూ, కోడింగ్ భాషలో వ్యవహారాలు నడిపిస్తున్నా పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో సుమారుగా రెండువేల మందికి పైగా కాంటాక్ట్స్ తో ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నారు. గత వారం రోజుల క్రితం పోలీస్ దాడులతో పట్టుబడిన సదరు వ్యక్తి స్టేషన్ బెయిల్ తీసుకుని మళ్లీ దందా షురూ చేసినట్లు సమాచారం.
వైఫల్యమా? పరోక్ష సహకారమా?
బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద స్థాయిలో ఆరేళ్లుగా దందా సాగుతుంటే పోలీసులు కనీసం కనిపెట్టలేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు నివసించే కాలనీల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగడం వల్ల సామాన్య ప్రజలు, యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత బహిరంగంగా సాగుతున్న ఈ దందా వెనుక ఎవరున్నారన్న చర్చ జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతుంది.
పోలీసుల కళ్ళు గప్పి..
గత ఆరు సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలో నిర్వాహకులు పోలీసుల కళ్ళు గప్పి తమ తతంగాలను కొనసాగించడం విమర్శలకు దారి తీసింది. చిన్న సంఘటన జరిగిన పోలీసుల దృష్టికి వస్తుంది. కానీ వందలాది మందితో హైటెక్ స్థాయిలో జరుగుతున్న ఈ వ్యవహారాలు అత్యంత పకడ్బందీగా జరగడంతో పోలీసులు సైతం పసిగట్టలేకపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ చీకటి సామ్రాజ్యంపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.






