అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

by Naveena |

ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు వీలుగా ఆయా పథకాల కింద నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 20 : ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు వీలుగా ఆయా పథకాల కింద నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు. గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లతో కలిసి అమృత్ 2.0 పథకం పనుల ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. సుమారు రూ. 400 కోట్ల విలువ గల పనులకు గత జనవరి నెలలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి షబ్బీర్ అలీ ఇతర ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేసిన విషయం విధితమే.

ప్రస్తుతం ఆ పనులు ఏ దశలో కొనసాగుతున్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిధుల కొరత ఎంతమాత్రం లేదని, పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా ప్రస్తుత వేసవి సీజన్లో నగరంలో ఇంటింటికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. రోడ్లు, ఇతర పెండింగ్ పనులను పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ గురించి కూడా ఉన్నతాధికారులతో ఇటీవలే చర్చించామని అన్నారు. మాస్టర్ ప్లాన్ అమలు జరిగితే నిజామాబాద్ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అధికారులు ప్రజోపయోగ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే నిజామాబాద్ నగరపాలక సంస్థ పనితీరు కలెక్టర్ పర్యవేక్షణలో ఎంతో బాగుందని షబ్బీర్ అలీ ప్రశంసించారు. ప్రస్తుత రంజాన్ మాసంలో ఎలాంటి ఫిర్యాదులకు తాగు లేకుండా శానిటేషన్ పండ్లను జరిపిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story