ఉపాధి హామీ పని చేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

by Jakkula.Mamatha |

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలోని మదనపల్లి గ్రామంలో నిర్వహించిన 8వ రోజు ప్రత్యేక శిబిరం ఉత్సాహభరితంగా జరిగింది.

ఉపాధి హామీ పని చేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
X

దిశ, నిజాంసాగర్: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలోని మదనపల్లి గ్రామంలో నిర్వహించిన 8వ రోజు ప్రత్యేక శిబిరం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ స్వయంగా ఉపాధి కూలీలతో కలిసి ఉపాధి హామీ పనిలో పాల్గొని నిజమైన ప్రజా నాయకత్వాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. గ్రామీణ పేదలకు భరోసా ఇచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మన్రేగా)ను బలహీనపరచే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 100 రోజుల ఉపాధి హామీ కేవలం ఒక పథకం మాత్రమే కాదు అది కోట్లాది గ్రామీణ కుటుంబాల జీవనాధారం అన్నారు. మహిళల సాధికారతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మన్రేగా కీలక ఆధారం అని తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు ఈ శిబిరంలో ఐక్యంగా పాల్గొనడం ద్వారా గ్రామీణ కార్మికుల హక్కుల పరిరక్షణకు తమ కట్టుబాటును స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. మాటల్లో కాదు, చేతల్లో చూపించే నాయకత్వం కాంగ్రెస్‌దేనని, పేదల చేతిలో పని ఉండాలి... గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. ఇదే మా సంకల్పం అని ఆయన అన్నారు. ఈ శిబిరంలో స్థానిక గ్రామస్తులు, ఉపాధి కూలీలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూలీలతో కలిసి పనిలో నిమగ్నమైన నాయకులను చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ అభివృద్ధి, కార్మిక హక్కుల పరిరక్షణ, మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం మరింత ఉధృతం కానుందని నాయకులు స్పష్టం చేశారు. మన్రేగా పరిరక్షణకు చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని బలంగా చాటిచెప్పింది.

Next Story