సహకార సంఘం నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ!

by Malleboina Mahesh |

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సహకార సంఘాల నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది. మొత్తం 144 సంఘాల్లో 1,872 పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

సహకార సంఘం నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ!
X

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సహకార సంఘాల నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 144 సంఘాల్లో 1,872 డైరెక్టర్ పదవులు భర్తీ కానున్నాయి. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జుల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్ఠానం సూచించింది. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారినే పదవులకు ఎంపిక చేయాలని నిబంధన విధించారు. ఎమ్మెల్యేలు అభ్యర్థుల జాబితాలను గోప్యంగా సిద్ధం చేస్తున్నారు. మండల స్థాయి పదవులతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ పెదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే అధికారికంగా నామినేటెడ్ జాబితాలు వెలువడే అవకాశం ఉంది.

దిశ, కామారెడ్డి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (సింగిల్ విండో సొసైటీ) ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా నామినేటెడ్ ప్రాతిపదికన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎంపిక చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొత్త పాలకవర్గాలను నియమించే వరకు పాతవారినే కొనసాగించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పద్ధతిలో పదవులను ఇవ్వాలని ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ క్రమంలోనే ఆయా సొసైటీలో ఎవరెవరికి పదవులు ఇవ్వాలనే అంశంపై స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షులకు సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలను తయారు చేసి వెంటనే అందజేయాలని కోరినట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షులు జాబితాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఎలాగైనా తమకు పదవులు చేజిక్కించుకోవాలనే ఆశలో ఉన్న వారు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 144 సంఘాలు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 144 సహకార సంఘాలు ఉన్నాయి. అయితే ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లను నియమించాల్సి ఉంటుంది. వీరిలో నుంచే ఒకరు చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం 1872 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకు ఈ పదవులు దక్కనున్నాయి.

డీసీసీబీ, డీసీఎంఎస్‌లను నియమిస్తే మరిన్ని పదవులు..

ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు డీసీసీబీ, డీసీఎంఎస్ సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీల్లో డైరెక్టర్లుగా ఎన్నికైన వారు సొసైటీల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. సొసైటీ చైర్మన్లు డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్లను ప్రతిపాదిస్తారు. గతంలో కాకుండా ఈసారి నామినేటెడ్ పద్ధతిన సొసైటీల్లో డైరెక్టర్ల ఎంపికను చేపట్టారు. జిల్లాకు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకుంటే మరికొంత మందికి కూడా పదవులు వచ్చే అవకాశం ఉంటుంది.

గోప్యంగా జాబితాలు..

సొసైటీల్లో నియమించబోయే పదవుల జాబితాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్థానిక ఇన్చార్జీలు గోప్యంగా తయారు చేస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికలతోపాటు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అయిన స్థానిక సంస్థల్లోనూ పోటీ చేసే అవకాశం లేని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పదవుల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం, పార్టీ అధిష్టానం కూడా ఇవే సూచనలు చేసినట్లు తెలిసింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటూ పదవులు పొందని వారిని గుర్తించాలని కూడా సూచనలు చేసినట్లు సమాచారం.

సొసైటీల్లో సభ్యత్వం ఉన్నవారికే ఎంపిక..

నామినేటెడ్ పదవుల ఎంపికలో ముఖ్యంగా సొసైటీల్లో సభ్యత్వం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. తమకు అనుకూలంగా ఉన్న వారితో పాటు సొసైటీలో సభ్యత్వం ఉన్నవారినే ఎంపిక చేయడం స్థానిక నేతలకు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నప్పటికీ ఈ నిబంధనతో అర్హులకు పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల చుట్టూ నేతల ప్రదక్షిణలు

ప్రభుత్వం నియమించనున్న సొసైటీల చైర్మన్, వైస్ చైర్మన్ లతోపాటు డైరెక్టర్ల నియామకాల జాబితాలో తమ పేర్లు ఎలాగైనా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Next Story