- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : మాజీ మంత్రి హరీశ్ రావు
దిశ, నాగిరెడ్డిపేట్ : భారీ వర్షాలు వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకుంటామని కామారెడ్డి జిల్లా

దిశ, నాగిరెడ్డిపేట్ : భారీ వర్షాలు వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకుంటామని కామారెడ్డి జిల్లా పర్యటనలో భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల కేంద్రం సమీపంలో మంజీరా నది పరివాహక ప్రాంతం నిజాం సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో ముంపునకు గురై నష్టపోయిన పంటలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎల్లా రెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. కామారెడ్డి జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదికలో దాదాపు రూ. 344 కోట్ల నష్టం జరిగిందని చెబితే.. ఇప్పటివరకు ఈ జిల్లాకు ప్రభుత్వం 34 రూపాయలు కూడా విడుదల చేయలేదని విమర్శించారు.
భారీ వర్షాలతో జిల్లాలో ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, చెరువులు తెగిపోయి కాల్వలకు గండ్లు పడ్డాయని గుర్తు చేశారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం ఏ ఒక్కచోట కూడా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ మధ్యలో తెగిపోయిన బ్రిడ్జిని చూసి వెళ్ళిపోయారు తప్ప నష్టపోయిన పంటలను పరిశీలించలేదన్నారు. బ్రిడ్జి తెగిపోయి నెల రోజులైనా మరమ్మతులు చేయకపోవడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి బస్సులు నడవడం లేదన్నారు. జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల చదువులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సమయంలో రోడ్లు, చెరువులు, విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని 15 రోజుల్లో మళ్లీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని చెప్పి నెల రోజులు గడుస్తున్నా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది లేదన్నారు.
ఇన్ చార్జీ మంత్రి సీతక్క ఇటు జిల్లా వైపు మళ్లీ చూసింది లేదు, బ్రిడ్జిలు రిపేరు చేసింది లేదు. రైతులకు పైసా సాయం చేసింది లేదన్నారు. రైతులకు సమయానికి యూరియా సరఫరా చేయక, రెండు పంటలకు రైతుబంధు ఎగనామం పెట్టి, సన్న వడ్లకు బోనస్ ఇవ్వకుండా, వరదలతో నష్టపోయిన రైతులకు పైసా నష్టపరిహారం చెల్లించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నాడని విమర్శించారు. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ వర్షాల కారణంగా నాలుగైదు చోట్ల భారీ గండ్లు పడ్డాయని, రైతుల పంటలకు సాగునీరు అందించడానికి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులకు వరద ముంపు తో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి 25 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, జనార్దన్ గౌడ్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, టీఎస్పీఎస్సీ మాజీ బోర్డు మెంబర్ సుమిత్రా ఆనంద్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.






