ఆర్మూర్ మున్సిప‌ల్ లో అస్త‌వ్య‌స్తంగా పాల‌న

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా తయారైంది.

ఆర్మూర్ మున్సిప‌ల్ లో అస్త‌వ్య‌స్తంగా పాల‌న
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బదిలీల్లో ఆర్మూర్ మున్సిపల్ లో అధికార పార్టీ కౌన్సిలర్ అన్ని తానే చూస్తున్నారని ఆయన కలుసన్నల్లోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక శాఖ నుంచి మరో శాఖకు ఇష్టారీతిగా బదిలీలు చేపడుతున్నారని ఆరోపణలు ఆర్మూర్ లో గుప్పుమంటున్నాయి. మున్సిపల్ లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒక శాఖ నుంచి మరో శాఖకు మార్చే క్రమంలో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో అవినీతి రాజ్యమేలుతుందని పలువురు చెబుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వారికి ఇష్టమైన సెక్షన్‌లో పోస్టింగ్ కావాలంటే మున్సిపల్ లో అన్ని తానే చూస్తున్న ఆ అధికార పార్టీ కౌన్సిలర్ కు కప్పం కట్టాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు.

ఈ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శాఖల మార్పు వ్యవహారంలో ఆర్మూర్ లో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ పెత్తనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆర్మూర్ మున్సిపల్ లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సెక్షన్ ల వారీగా బదిలీలు వివాదాస్పదంగా మారాయి. మున్సిపాలిటీలో పనుల అవసరాల మేరకు సాధారణంగా పరిపాలనలో భాగంగా జరగాల్సిన ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శాఖల మార్పు వ్యవహారం ప్రస్తుతం ఆర్మూర్ లో అధికార పార్టీ కౌన్సిలర్ కనుసన్నాల్లో పూర్తిగా డబ్బుల ఆధారంగా సాగుతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు అనుకూలమైన శాఖలోకి మారి ఆ శాఖలో పని చేయాలంటే ముందుగా ఆమ్యాన్యాలు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తిందని కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. ఔట్ ''సో'' ర్సింగ్ ఉద్యోగులకు ఆమ్యామ్యాల ఆఫర్లతో కాసులు చెల్లిస్తేనే కానీ పని లేదంటూ మున్సిపల్ లో అధికార పార్టీ కౌన్సిలర్ పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినబడు తున్నాయి.

ఆర్మూర్ మున్సిపల్ లో అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న వారి కోసం పరిపాలన విభాగంలోని మున్సిపల్ శాఖలో కొన్ని మార్పులు చేయడానికి ప్రస్తుతం ఉన్న వారిని మరో శాఖలోకి బదిలీలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చెందిన ఆర్మూర్ మున్సిపల్ లో ఓ కౌన్సిలర్ , నాయకులు తమకు నచ్చిన వారిని వారికి నచ్చిన శాఖలోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం మున్సిపల్ శాఖలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. దీంతో ఆర్మూర్ మున్సిపల్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆర్మూర్ మున్సిపల్ లోని ఉన్నత ఉద్యోగులను, రెగ్యులర్ ఉద్యోగులను కాదంటూ అన్ని పనులు మేమే చక్క పెడతాం అంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్మూర్ బల్దియాను గుప్పిట్లో పెట్టుకుంటున్నారని చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపల్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించి ఆర్మూర్ మున్సిపల్ లో పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చైర్ ప‌ర్స‌న్ ఛాంబ‌ర్ లో మైనార్టీ నాయ‌కుల బాహా.. బాహి

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఛాంబర్ లో ఇటీవల ఆర్మూర్ మున్సిపల్ కు ఓ మైనార్టీ రాష్ట్ర స్థాయి అధికారి వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టలేదనే చిన్న విషయంపై బాహా బాహి వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు మున్సిపాలిటీలో ప్రజలకు చక్కని పాలనా అందించేందుకు వారి ఓట్ల ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే వారేమో స్వయాన ఆర్మూర్ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ ఛాంబర్ లోనే ఓ అధికారి ఆర్మూర్ వచ్చిన సందర్భంగా తమ ఫోటో పెట్టకపోవడం పట్ల ఓ మైనారిటీ నాయకుడు, అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ కౌన్సిలర్ ఇద్దరి మధ్యలో వాదన పెరిగి బాహా బాహి చేసుకున్నట్లు ఆర్మూర్లో జనం కోడై కూస్తున్నారు. ఆర్మూర్ చైర్ ప‌ర్స‌న్ ఛాంబర్ లోని మైనార్టీ నాయకులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారనే విషయం ఆర్మూర్ లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ లో గాడి తప్పిన పరిపాలనను అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు దృష్టి సారించి గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్మూర్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story