కాంగ్రెస్ లోకి రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ లోకి రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్
X

దిశ, ఆర్మూర్ : బీఆర్ఎస్ పార్టీకి నేడు గడ్డు పరిస్థితులు దాపురించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఒక్కొక్కరు పార్టీ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లాలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న జాబితాలో తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన రాష్ట్ర మార్క్​ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాష్ట్ర మార్క్​ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఆయన మద్దతుదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, ఇందూర్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి మార గంగారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే తెలంగాణ రాష్ట్ర మార్క్​ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో సిట్టింగ్ లకే మూడు దఫాలుగా టికెట్లను కేసీఆర్ ఇవ్వడంతో పార్టీ లో క్యాడర్ నిరాశకు గురై సరైన రీతిలో పనిచేయకపోవడంతో అపారంగా పార్టీకి నష్టం వాటిల్లినట్లు మార్కెట్ చైర్మన్ మార గంగారెడ్డి బాహటంగానే చెబుతున్నారు. ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డికి మూడో దఫా టికెట్ ఇవ్వడంతో

ఆర్మూర్లో పార్టీ నష్టానికి జీవన్ రెడ్డి ప్రధాన కారకుడని గంగారెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జీవన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత కూడా ఆర్మూర్లో పార్టీ ప్రక్షాళనకు నాయకులు నడుం బిగించకుండా మళ్లీ జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పించడంపై తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మార గంగారెడ్డి కాంగ్రెస్​లో చేరితే ఆయన క్రియాశీల రాజకీయాల్లో ప్రభావం చూపనున్నారు. ఇందూర్ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మార గంగారెడ్డి కలిసిన సందర్భంలో ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, రూరల్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు, అర్గుల్ మాజీ సర్పంచ్ అర్గుల్ నరసయ్య కూడా ఉన్నారు. ఈ నాయకులు సైతం త్వరలోనే కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్టు సమాచారం.

Read More..

నిరూపిస్తే మొత్తం రాసిస్తా.. లోకేష్‌కు ఎమ్మెల్యే అవంతి సవాల్


Next Story

Most Viewed