మక్కల కొనుగోలులో 'బయో' తిప్పలు..

by Ratna Kumari |

దిశ,​ తాడ్వాయి : అన్నదాతకు కష్టాలు పిట్టల మీద అమి తుమ్మిలా దాడి చేస్తున్నాయి. అకాల వర్షాలు, చీడపీడలను తట్టుకుని పండించిన పంటను

మక్కల కొనుగోలులో బయో తిప్పలు..
X

దిశ,​ తాడ్వాయి : అన్నదాతకు కష్టాలు పిట్టల మీద అమి తుమ్మిలా దాడి చేస్తున్నాయి. అకాల వర్షాలు, చీడపీడలను తట్టుకుని పండించిన పంటను అమ్ముకుందామంటే.. ఇప్పుడు సాంకేతికత రూపంలో కొత్త కష్టం వచ్చి పడింది. తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో మక్కల కొనుగోలు ప్రక్రియ సర్వర్ల చుట్టూ, వేలిముద్రల చుట్టూ ఆశగా ఎదురుచూస్తున్నారు. వేలిముద్ర పడితేనే తూకం పడుతుండటంతో, గంటల తరబడి రైతులు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు.

మొరాయిస్తున్న సర్వర్.. వేధిస్తున్న నిరీక్షణ

కొనుగోలు కేంద్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. సర్వర్ సమస్య కారణంగా గంటకు ఇద్దరు ముగ్గురు రైతుల వేలిముద్రలు కూడా పడటం లేదు. పొద్దున తిండి తిని క్యూలో నిలబడితే,రాత్రి వరకు రైతు వంతు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. వయసు మళ్లిన రైతులకు, నిరంతరం శ్రమించే రైతులకు చేతి వేళ్లు అరిగిపోవడంతో బయోమెట్రిక్ మిషన్లు వారిని గుర్తించడం లేదు. మా పంట అమ్ముకోవడానికి మేము ఇంతగా నరకం చూడాలా? అని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

నిబంధనల పేరుతో కాలయాపన!

మరోవైపు అధికారులు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. వ్యవసాయ అధికారి నర్సింలు స్పందిస్తూ...పై అధికారుల ఆదేశాల ప్రకారం బయోమెట్రిక్ తప్పనిసరి.సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తేనే తూకం ప్రక్రియ ముందుకు సాగుతుంది అని తేల్చి చెప్పారు.ఈ మొండి నిబంధనలతో రోజుల తరబడి మక్కల కుప్పల దగ్గరే కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​ పరిష్కారం ఎప్పుడు?

తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. బయోమెట్రిక్ పడని వారికి కంటి గుర్తింపు విధానాన్ని అమలు చేస్తారా​ లేదా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ క్షేత్రస్థాయి పరిశీలనతో మక్కలు కొనుగోలు చేయిస్తారా సర్వర్ సామర్థ్యాన్ని పెంచి ప్రక్రియను వేగవంతం చేస్తారా అనేది ప్రశ్నగా మిగిలింది.ఏదేమైనా ​సాంకేతికత రైతులకు సాయపడాలి కానీ, వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story