- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చి‘వరి’ఆశలు గల్లంతేనా..?
జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకున్నది.

దిశ, కామారెడ్డి : జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకున్నది. భూగర్భ జలాలు అత్యంత వేగంగా పడిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంవత్సర ప్రారంభంలో ఉన్న భూగర్భ జలాలకు ప్రస్తుత జలాలకు పోల్చితే మీటరు నుంచి మీటరున్నర లోతుకు పడిపోయాయి. దీంతో మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయకుండా పోతున్నాయి. ఒక వైపు భూగర్భ జలాలు అడుగంటడం, కాలువ చివరి భూములకు సాగు నీరందకపోవడంతో.. పంట పొలాలు ఎండి పోతున్నాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా ఉన్న బావులు, బోర్లు అడుగంటి పోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో సైతం భూగర్భ జలాలు పడిపోయి నీటి అవసరాలు తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భూగర్భ జలాలు ఈ యేడు ఆరంభంలో 10.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జల నీటిమట్టం ప్రస్తుతం సుమారు 20 మీటర్ల లోతుకు పడిపోయాయి. పీట్లం మండలంలో ఏకంగా 35.62 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. బోర్లను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న రైతులు భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో బోర్లు వట్టిపోతుండడంతో కళ్ళముందే పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
3, 97,185 ఎకరాల్లో పంటలు సాగు
జిల్లాలో 3,97,185 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. కాగా ఇందులో ప్రధానంగా 2,61,109 ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే ప్రాజెక్టులు, చెరువులు, కాలువల కింద 45 వేల ఎకరాలు పోను మిగతా 2,16,109 ఎకరాలు బోరు బావుల కింద సాగవుతున్నాయి. ఇందులో సుమారు ఒక లక్ష 6 వేల బోరు బావులున్నాయి. అయితే ఈ బోరు బావుల్లో సగానికి పైగా నీటి ఊటలు తగ్గిపోవడంతో అవి వట్టి పోతున్నాయి.
పడిపోతున్న భూగర్భ జలాలు..
జిల్లాలో గత ఏడాది నవంబర్ నెలలో 8.43 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా..ప్రస్తుతం నాలుగు నెలల్లో సుమారు 15 నుంచి 25 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలోని పిట్లం మండలంలో 35.62 మీటర్ల లోతులో భూగర్భ జలాలు పడిపోగా.. జిల్లాలోని మిగతా మండలాల్లో 15 నుంచి 25 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో రెండు ఇంచుల వరకు నీరు పోసే బోరుబావులు సైతం పూర్తిగా వట్టి పోయి నీరు పోయడం మానేశాయి. మరికొన్ని బోర్లు ఆపుతూ ధారలుగా నీరు పోస్తున్నప్పటికీ పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయి.
బోర్లు తవ్విస్తూ అప్పుల పాలవుతున్న రైతులు...
తమ కళ్ళముందే వేసిన పంటలు ఎండిపోతుండడంతో వాటిని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నంలో రైతులు బోర్లను తవ్విస్తూ నీరు పడకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఒక్కో రైతు 300 నుంచి 500 అడుగుల వరకు బోర్లను తవ్విస్తుండగా.. సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెడుతూ..అప్పుల పాలవుతున్నారు.
రైతులు వేసిన పంటలు
............................
పంట ఎకరాలు
వరి 2,61,109
శనగ 59,558
మక్క 35,134
జొన్న 31,591
మినుము 2,737
పొద్దు తిరుగుడు 1,628
పల్లి 527
పొగాకు 497
గోధుమ 426






