అంగన్వాడీ అద్దె భవనాలు.. అరకొర సౌకర్యాలు..

by Disha Web Desk 20 |
అంగన్వాడీ అద్దె భవనాలు.. అరకొర సౌకర్యాలు..
X

దిశ, తాడ్వాయి : భావిభారత పౌరులకు పౌష్టికాహార లోపం లేకుండా ఉండేందుకు గర్భిణీలకు చిన్నారులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగన్వాడీ కేంద్రాలు.. సమస్యలకు నిలయలుగా మారుతున్నాయి. ఓవైపు ఇరుకైన అద్దె భవనాలు మరోవైపు కొన్ని అంగన్వాడీ సెంటర్ లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఎలాగోలా నెట్టుకస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఏ ఒక్క అంగన్వాడీ భవనంలో కూడ విద్యుత్ సరఫరా ఇప్పటివరకు అందలేదు.

ఒకే గదిలో వంట.. పిల్లలు..

తాడ్వాయి మండలంలో 45 ముఖ్యమైన అంగన్వాడ కేంద్రంలు ఉండగా అందులో మినీ అంగన్వాడి కేంద్రంలు 2 ఉన్నాయి. అందులో సొంత భవనాలు 24 కేంద్రాలు ఉండగా మిగిలిన 23 కేంద్రాలు అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. ఈ అద్దె భవనాలకు 1000 నుంచి 1500 వరకు నెలవారీగా అద్దె చెల్లిస్తున్నారు. అంగన్వాడి కేంద్రానికి ఒక వంటగది రెండు తరగతి గదులు ఒక బాత్రూంతో పాటు ఆటస్థలం ఉండాలి. ప్రభుత్వం చెల్లించే తక్కువ అద్దెలకు ఇలాంటి వసతులు ఉన్న ఇల్లు దొరికే పరిస్థితి లేదు.

అరకొర సౌకర్యాలు ఉన్న గదుల్లో అంగన్వాడి కేంద్రాలను నడిపిస్తున్నారు. ఒకే గదిలో అంగన్వాడీ సామాగ్రి, అందులోనే వంట చెయ్యడం, అదే గదిలో పిల్లలను కూర్చోబెట్టడం వలన అంగన్వాడీ కేంద్రంలో రానురాను సమస్యలు పెరుగుతుండడం పై పిల్లల తల్లితండ్రులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క తాడ్వాయి మండల కేంద్రంలోనె 6 అంగన్వాడీ సెంటర్ లు ఉండగా అందులో 5 కేంద్రాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి.

కరెంట్ లేక తిప్పలు..

మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలల్లో విద్యుత్ సప్లయ్ లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. ఒకపక్క బగబగ మండుతున్న ఎండలకు చిన్నపిల్లలు ఉక్కపొతతో విలవిలాడుతున్నది చుసి వారి తల్లితండ్రులు అంగన్వాడీ సెంటర్లకు పంపేందుకు జంకుతున్నారు. సిబ్బంది ప్రతిదీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ యాప్‌తో గర్భిణులు, బాలింతలకు ఒకపూట భోజనం, లబ్ధిదారుల హాజరు శాతం, పిల్లలకు ఇంటికి రేషన్‌, స్నాక్స్‌, ఒక పూట భోజనం తదితర వివరాలు యాప్‌లో నమోదు చేస్తారు.

అంతేకాకుండా చిన్నారుల బరువు, ఎత్తు, కొలతలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసి వారి పోషణ స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అంతేకాకుండా అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది విధులు, రికార్డుల నిర్వహణ, సరుకుల పంపిణీ, చిన్నారుల పెరుగుదల, టీకాల పంపిణీ తెలుసుకునే వీలుంది. టీచర్ల మొబైల్ యాప్‌లో పొందుపర్చారు. అంగన్వాడికి సంబంధించిన పూర్తివివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సరిగా పనిచెయ్యకపోవడం కూడా సమస్యగా మారిందాన్నారు.

సిబ్బంది కొరత..

తాడ్వాయి మండల కేంద్రంలోనే రెండు సెంటర్లు ఉండగా అందులో ఒక అంగన్వాడీ సెంటర్ కు టీచర్, హెల్పర్, మరో అంగన్వాడీ సెంటర్ కు హెల్పర్ లేకపోవడంతో ఉన్న వారితో కొనసాగిస్తున్నారు. దీనితో ఒక్క సెంటర్ విధులు నిర్వహించల్సిన సిబ్బంది రెండు సెంటర్ ల పనులు చెయ్యడంతో తలకుమించిన భారం అవుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 45 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో ఇద్దరు అంగన్వాడీ టీచర్లు, 11 మంది హెల్పర్ల పోస్టులు ఖాలిగా ఉండడంతో ఉన్నవారితో నెట్టుకస్తున్నామని అంటున్నారు. ప్రధానంగా హెల్పర్ లేకపోవడంతో వారు చేసే పని అంగన్వాడీ టీచర్ చెయ్యాల్సి వస్తుందని అంటున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed