ఎమర్జెన్సీ పంపింగ్‌‌పై జల మండలి ఫోకస్.. రెండో దశకు పక్కా ప్లాన్

by Shiva |
ఎమర్జెన్సీ పంపింగ్‌‌పై జల మండలి ఫోకస్.. రెండో దశకు పక్కా ప్లాన్
X

దిశ, సిటీ బ్యూరో: నాగార్జునసాగర్ నీటిని సిటీకి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ పంపింగ్ పనులను జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి గురువారం పరిశీలించారు. పనులెలా జరుగుతున్నాయి? పంపింగ్ సక్రమంగా జరుగుతుందా? అంటూ ఆయన అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ..హైదరాబాద్ నగర వాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేస్తున్నామన్నామన్నారు. పంపింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందన్నారు. సాగర్‌లో నీటిమట్టం స్థాయి ఇంకా తగ్గితే, రెండో దశ పంపింగ్ ఏర్పాటు చేసి దాని ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. నీటిలో సబ్ మెర్సబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు.

జలమండలి పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో తాగునీటి సరఫరా కూడా పెరిగిందన్నారు. హైదరాబాద్ నగరానికి ఈ వేసవిలో 580 ఎంజీడీల నీటి సరఫరా చేసినట్లు వెల్లడించారు. వివిధ సోర్స్‌ల నుంచి గతేడాది కంటే 20 ఎంజీడీలు అదనపు నీటిని నగరవాసులకు అందించామన్నారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక సరఫరా అన్నారు. సాధారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో డెడ్ స్టోరేజీలో 25.941 టీఎంసీలు, 510 అడుగుల నీరు ఉన్నంత వరకు వాడుకునే వెసులుబాటు ఉంటుందని, వేసవిలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందన్నారు. నాగార్జున సాగర్‌లో జలాలు డెడ్ స్టోరేజికి పడిపోయినా, ఈ ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీరు అందించవచ్చునన్నారు.

సుంకిశాల ప్రాజెక్టు సందర్శన..

పంపింగ్ ప్రక్రియను పరిశీలించిన తర్వాత ఎండీ సుదర్శన్‌రెడ్డి సుంకిశాల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పైపు‌లైన్ పనులను ఎండీ పరిశీలించారు. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపు‌లైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుదిదశకు చేరుకున్నాయని, సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి ఈ సెప్టెంబరు వరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ట్రాన్స్ మిషన్ సీజీఎం దశరథ్‌రెడ్డి, జీఎం శ్రీధర్‌రెడ్డి, ప్రాజెక్టు, ట్రాన్స్ మిషన్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed