లాంగ్ స్టాండింగ్‌లపై కొరడా.. త్వరలో బదిలీలు చేసే యోచనలో కమిషనర్

by Shiva Kumar |
లాంగ్ స్టాండింగ్‌లపై కొరడా.. త్వరలో బదిలీలు చేసే యోచనలో కమిషనర్
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో లాంగ్ స్టాండింగ్‌గా ఒకే చోట కొనసాగుతున్న ఉద్యోగులను బదిలీ చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ యోచిస్తున్నట్లు సమాచారం. ఒకే చోట మూడేళ్లు దాటిన వారికి స్థానచలనం కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున, వచ్చే నెల 6న కోడ్ తొలగిపోవటంతో ఈ ట్రాన్స్‌ఫర్లు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అంతలోపు పరిపాలన విభాగం అధికారులు ఒకే చోట విధులు నిర్వహిస్తూ మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వివరాలను సమర్పించాలని ఆయన హుకూం జారీ చేసినట్లు తెలిసింది. కానీ ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లపై జీహెచ్ఎంసీలోకి వచ్చి, గడువు ముగిసినా నిబంధనలకు విరుద్దంగా ఇంకా ఇక్కడే కొనసాగుతున్న అధికారులను కూడా తమ మాతృశాఖలకు సరెండర్ చేయాలని పలు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ గురువారం కమిషనర్‌కు వినతి పత్రాన్ని కూడా సమర్పించినట్లు సమాచారం.

పొమ్మనని జీహెచ్‌ఎంసీ..రమ్మనని మాతృ శాఖ

ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ, పబ్లిక్ హెల్త్ విభాగాల నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులు జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరిలో నూటికి తొంభైశాతం మంది ఉద్యోగుల డిప్యూటేషన్ గడువు ముగిసినా, వారిని కనీసం జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లమనటం లేదు, వారి మాతృశాఖ రమ్మని పిలవకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంబర్‌పేట సర్కిల్‌లో శానిటేషన్ ఉద్యోగి అటెండెన్స్ విషయమై బయోమెట్రిక్ మిషన్‌ను ట్యాంపరింగ్ చేసిన ఘటన వెలుగుచూసినా, అక్కడి మెడికల్ ఆఫీసర్‌కు కమిషనర్ కేవలం మెమో జారీ చేసి పనైపోయిందనుకుంటున్నారని పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

గతంలో కూడా సర్కిల్ 16కు చెందిన మెడికల్ ఆఫీసర్ పలు హాస్టళ్లకు ఆగమేఘాలపై నోటీసులు జారీ చేసి, వారిని భయభ్రాంతులను చేసి, ఆ తర్వాత వారితో లక్షల రూపాయల లంచాలు డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చినా, కమిషనర్ పట్టించుకోవటం లేదని ఇతర ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదే వైద్యారోగ్య శాఖకు చెందిన మరో మెడికల్ ఆఫీసర్‌కు జీహెచ్ఎంసీలో కొనసాగాలన్న లిఖితపూర్వకమైన ఆదేశాలేమీ లేకపోయినా, ఆయన ప్రస్తుతం గాజులరామారం సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దాదాపు డజను మంది మెడికల్ ఆఫీసర్లు, ఇంజినీర్లు నిబంధనలకు విరుద్దంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈసారి కమిషనర్ వారిని తమ మాతృశాఖకు బదిలీ చేస్తారా? లేక బదిలీలను పిచ్చుకలపై బ్రహ్మస్త్రంలా కేవలం కార్పొరేషన్ ఉద్యోగులకే పరిమితం చేస్తారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

కౌన్సిల్‌ తీర్మాణ అమలు చేయడంలో కమిషనర్ విఫలం..

జీహెచ్ఎంసీలో తిష్టవేసిన అక్రమార్కులైన కొందరు అధికారులను కాపాడుకునేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కౌన్సిల్ సమావేశంలో చేసిన ప్రకటనను సైతం అమలు చేయకుండా వ్యవహరిస్తున్నట్లు పలువురు కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా అరుదుగా రెండు రోజుల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశంలో రిటైర్డు అయిన, డిప్యూటేషన్లు ముగిసిన అధికారులను వారి మాతృశాఖలకు పంపివేస్తామని సభలో ప్రకటన చేసిన కమిషనర్ ఇప్పటి వరకు ఏఒక్కరిని పంపలేదన్న విమర్శలున్నాయి. హౌజింగ్ ఓఎస్డీ, అదనపు కమిషనర్ (ఫైనాన్స్) ఇద్దరు అధికారులు తమ పదవీకాలం ముగిసి వెళ్లిపోయారే తప్పా, ఇంకా విధులు నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ ఇన్‌చార్జిని కమిషనర్ పంపకపోవటం చర్చనీయాంశంగా మారింది.

ఈ రకంగా డిప్యూటేషన్ గడువు ముగిసిన ఇంజినీర్లు ఒక్కొక్కరు నాలుగైదు రకాల ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తూ అడ్డదారులలో కాంట్రాక్టర్ల అవతారమెత్తినా, వారిపై కమిషనర్ చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యమేమిటీ? అంటూ కొందరు అధికారులే బహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఖైరతాబాద్ జోన్‌లోని మెహిదీపట్నంలో విధులు నిర్వర్తిస్తూ, బినామీ కాంట్రాక్టులను చేజిక్కించుకుంటూ అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్ పనులు నాసిరకంగా చేయించిన ఇంజినీర్ పై కూడా కమిషనర్ చర్యలు చేపట్టకపోవటం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది.

Next Story

Most Viewed