మోతె గ్రామంలో 144 సెక్షన్

by Disha Web Desk 15 |
మోతె గ్రామంలో 144 సెక్షన్
X

దిశ, భీంగల్ : ఎస్సీ కుటుంబాలకు, స్థానిక వీడీసీ కి మధ్య ఉన్న వివాదాస్పద భూమి విషయంలో మళ్లీ వీడీసీ పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేల్పూర్ మండలం మోతె గ్రామంలో బుధవారం నుండి 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా అమలులోకి వచ్చిన 144 సెక్షన్ ఈనెల 20 వరకు అమలులో ఉంటుందని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఎస్సీ కుటుంబానికి చెందిన ఎకరంన్నర భూమిని స్థానిక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బలవంతంగా లక్కోవాలని చూస్తుందని, తమపై సాంఘిక బహిష్కరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు మంగళవారం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు.

ఇప్పటికే ఈ వివాదస్పద భూమి విషయంలో కేసులు అవ్వడంతో పాటు సమస్య జఠిలమైన విషయం విధితమే. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంఘటన వివరాల్లోకి వెళ్తే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మోతె శివారులోని సర్వే నెంబర్ 333లో 8 ఎకరాల 34 గుంటల భూమి ఉండగా అందులో నాయకపోడ్ సంఘం వాళ్లకు 4 ఎకరాల 17 గుంటలు, తమ పేరున 4 ఎకరాల 17 గుంటలు ఉందని, అందులోని తమకు సంబంధించిన మిగిలిన ఎకరంన్నర భూమికి ఫెన్సింగ్ చేసుకోగా ఆ భూమి వీడీసీ వారిదని లక్కోవాలని చూస్తున్నారని బాధితుడు ఇస్సాపల్లి నడ్పి గంగారాం సీపీ కి ఫిర్యాదు చేశారు.

ఇటీవలే తాము తమ భూమి చుట్టూ నిర్మించిన ఫెన్సింగ్ ను బలవంతంగా తొలగించి మా కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ చేయాలని వీడీసీ నిర్ణయించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకు ముందే ఈ భూమి విషయంలో వీడీసీ బలవంతంగా ఫెన్సింగ్ లాగేసి తమ పై దాడికి దిగారని, ఈ విషయంలో ఇప్పటికే 23 మందిపై కేసులు అయ్యాయని, ఈ భూమికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేసు నడుస్తోందని సీపీ కి బాధితులు వివరించారు. అయినా మళ్లీ అదే తంతును వీడీసీ సభ్యులు కొనసాగిస్తున్నారని వివరించారు. దాంతో సీపీ ఆర్మూర్ ఏసీపీ తో మాట్లాడి వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Next Story

Most Viewed