పవన్ ఓ దిష్టి కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంపై టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-04 08:40:49  IST  )

భైంసా అల్లర్లతో తెలంగాణలో లబ్ధి పొందిన బీజేపీ ఇప్పుడు మళ్లీ మతం కార్డ్ ఉపయోగిస్తోందని కాంగ్రెస్ స్టేట్ చీప్ ఆరోపించారు.

పవన్ ఓ దిష్టి కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంపై టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్.. ఓ దిష్టి కల్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరూ ఓటు వేయరన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీకి గుండు సున్నా రాబోతోందని జోస్యం చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మతం పేరుతో బీజేపీ (BJP) రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమే తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఉండాలని హెచ్చరించారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించరన్నారు. భైంసా అల్లర్ల వల్లే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందని తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ముందు దానికి సమాధానం చెప్పండి:

8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్‍లో రాష్ట్రానికి ఎంత ఇచ్చారో బీజేపీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ‍తోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలుగా గెలిచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు, ఐఐఎమ్ ఏర్పాటుతో పాటు పలు అంశాల్లో అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్రం ప్రణాళికలు రూపొందిస్తూ దేశ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదని విమర్శించారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు, మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టు వంటి కీలకాంశాలను విస్మరిస్తోందని, బయో, ఫార్మ, సెమి కండక్టర్ పరిశ్రమల్లో, టూరిజంలో రాష్ట్రాన్ని విస్మరించారని దుయ్యబట్టారు.

3.76 లక్షల కోట్లు రావాల్సిన చోట రూ.1.84 లక్షల కోట్లే:

దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతం అని ఈ లెక్కన కేంద్రం నుండి రూ.3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉన్నా గత ఐదేళ్లలో రూ.1.84 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఐదేండ్లలో రూ.4.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే రాష్ట్రానికి తిరిగి రూ.3.76 లక్షల కోట్లే ఇచ్చిందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్‍లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కడుతున్న ట్యాక్స్ గుజరాత్ కు తరలిస్తున్నారని విమర్శించారు. మహిళలకు బడ్జెట్‍లో రూ.90 వేల కోట్ల నిధులు కోత పెట్టారని బీసీలకు ఇచ్చింది 13 వేల 600 కోట్లు మాత్రమేనన్నారు.

Next Story