తెలంగాణలో మరో భారీ స్కామ్..! ఆధారాలతో సహా బయటపెడతానంటూ హరీశ్ రావు సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-20 06:26:54  IST  )

రాష్ట్రంలో మరోస్కామ్ జరుగుతోందని ఈ విషయంలో తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని హరీశ్ రావు ఆరోపించారు. వాటిని అసెంబ్లిలో పెట్టబోతున్నట్లు చెప్పారు.

తెలంగాణలో మరో భారీ స్కామ్..! ఆధారాలతో సహా బయటపెడతానంటూ హరీశ్ రావు సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ ఎత్తున కుంభకోణం (Young India Integrated Schools Tender Scam) జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‍రావు (Harish Rao) ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కక్షపూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్కూళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారని కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం మంజూరు చేయడం లేదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో జరిగిన ఈ వందల కోట్ల టెండర్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని నా దగ్గర ఈ స్కామ్ కు సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలు ఉన్నాయని వాటన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో సభ సాక్షిగా బయటపెడతానన్నారు.

భారీ అవినీతి జరుగుతోంది:

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ గా అయ్యి పనులను పంచుకుంటున్నారని ఆరోపించారు. 76 స్కూళ్లకు సంబంధించిన ప్రతి టెండర్‍కు ఎక్సెస్‌ ధర కోట్ చేసి దక్కించుకున్నారు. టెండర్లలో కనిష్టంగా 4.59 శాతం నుంచి గరిష్టంగా 4.96 శాతం ఎక్సెస్‌తో, నిబంధనల ప్రకారం 5 శాతం దాటకుండా పక్కా ప్లాన్‌తో కొల్లగొట్టారని ఆరోపించారు. ఒక్కో స్కూలుకు రూ.250 కోట్లు కేటాయించగా, అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు రూ.150 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం రూ. 10,199.54 కోట్లు కాగా, కాంట్రాక్టర్లు దాన్ని రూ.10,693.55 కోట్ల ఎక్సెస్‌తో దక్కించుకున్నారని అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు రూ. 494 కోట్లు ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు.

సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలపై అనుమానాలు:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‍తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరల్లో అత్యధికంగా 4.95 శాతం ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించడం పలు అనుమానాలకు కలిగిస్తున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో 4.95 శాతం ఎక్సెస్ ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్‍లో 4.95 శాతం ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారన్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్‍లో 4.95 శాతం ఎక్సెస్ కు, మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్‍లో 4.77 శాతం ఎక్సెస్‍కు, మంత్రి కొండా సురేఖ నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ లో 4.99, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం నల్గొండలో 4.87, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గం ఖమ్మంలో 4.95, మంత్రి సీతక్క నియోజవర్గం ములుగులో 4.95, మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గం ఆందోల్‍లో 4.99, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్ లో 4.89, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలో 4.89 శాతం ఎక్సెస్ కు టెండర్లు ఇచ్చారని ఆరోపించారు.

సీఎం వాహనం రిజిస్ట్రేషన్ కంపెనీకి 9 టెండర్లు:

సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న వాహనం KLSR కంపెనీ పేరు మీదనే ఉంటుందని ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంతో పాటు ఏకంగా 9 స్కూళ్ల టెండర్లను ఈ ప్రభుత్వం అదే KLSR సంస్థకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు కావడం ఈ కుంభకోణానికి నిదర్శనం అన్నారు. నాడు కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఏనాడూ రాజకీయ పక్షపాతం చూపలేదని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మిషన్ కాకతీయ మొదటి దశ నుంచే, మిషన్ భగీరథ, బీసీ,మైనార్టీ గురుకులాలు ఇలా ఏ పథకమైనా 119 నియోజకవర్గాలకు సమానంగా ఇచ్చారన్నారు. మెడికల్ కాలేజీలను అన్ని జిల్లాలకు ఇస్తూ, నేటి కాంగ్రెస్ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గానికి కూడా ఇచ్చామన్నారు. దళిత బంధు లాంటి గొప్ప పథకాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర చింతకాని నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఘనత కేసీఆర్ దని గుర్తు చేశారు. అభివృద్ధిని సమానంగా చూసిన బీఆర్ఎస్ ఎక్కడ? కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న అక్కసుతో 26 నియోజకవర్గాలకు స్కూళ్లను ఆపేసిన మీరెక్కడ? అని హరీశ్ రావు విమర్శించారు.

Next Story