- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 20న కొత్త సర్పంచ్‌లకు బాధ్యతలు
రాష్ట్రంలోని గ్రామాలకు ఈనెల 20 నుంచి కొత్త సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. ఇందుకు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామాలకు ఈనెల 20 నుంచి కొత్త సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన అపాయింటెడ్ డేను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. మూడు విడతల్లో ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలన్నీ 20వ తేదీన ఒకేసారి ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఆ రోజు నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరి, ఐదు సంవత్సరాల కాలపరిమితి పాటు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, వివిధ కారణాలతో 21 గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మరికొన్నింటిపై కోర్టు స్టే ఉండగా, మిగిలిన దాదాపు 12,700 గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడనున్నాయి. గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో ముగియడంతో అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన అనంతరం కేంద్ర ఆర్థిక సంఘం, కేంద్ర పంచాయతీరాజ్ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. పాలకవర్గాలు లేకపోవడంతో ఇప్పటివరకు నిలిపివేసిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరనుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో పెండింగ్ నిధులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్ నిధులు విడుదలయ్యే అవకాశముందని సమాచారం.
నేడు రెండో విడత ఎన్నికలు
192 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీల్లో..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రెండో విడత ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. 192 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 57.22 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు 30,661 మంది సిబ్బందిని నియమించగా, 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,911 సర్పంచ్ స్థానాలకు 12,782 మంది అభ్యర్థులు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడతకు చెందిన 415 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, శనివారం అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమగ్ర వివరాలు..
ఎన్నికలు నిర్వహించే మండలాలు 193
ఎన్నికలు జరిగే సర్పంచ్ స్థానాలు 3,911
బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 12,782
ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు 29,917
బరిలో ఉన్న వార్డు సభ్యులు 71,071
పోలింగ్ కేంద్రాలు 38,337
రిటర్నింగ్ అధికారులు 4,593
ఎన్నికల నిర్వహణలో సిబ్బంది 30,661
వెబ్ కాస్టింగ్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలు 3,769
రెండో విడతలో...
ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు 57,22,665
పురుష ఓటర్లు 7,96,006
మహిళా ఓటర్లు 9,26,306
ఇతరులు 153
రెండో విడతలో...
ఒక్క నామినేషన్ దాఖలు కానీ సర్పంచ్ స్థానాలు 5
ఒక్క నామినేషన్ దాఖలు కానీ వార్డు స్థానాలు 108
ఏకగ్రీవమైన పంచాయతీలు 415
ఏకగ్రీవమైన వార్డు సభ్యులు 8307






