- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్ సిటీకి కొత్త ఊపిరి.. టోక్యో, సింగపూర్ రేంజ్‌లో డెవలప్మెంట్
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధితోపాటు..

దిశ, తెలంగాణ బ్యూరో: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వీటితోపాటు ఇప్పటికే ఉన్న హైదరాబాద్ కోర్ సిటీ, పాతబస్తీని సైతం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ప్రణాళిక రహితంగా నిర్మితమైన ప్రాంతాలను ప్రణాళిక బద్ధంగా నిర్మించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ రీ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో జనాభా పెరుగుదల, ఆర్థిక పరమైన అంశాలు, ఆధునీకరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలను రూపొందించనున్నారని అధికారులు చెబుతున్నారు.
ప్రపంచ నగరాల్లో అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు విభిన్న దృష్టి, ప్రమాణాలతో గణనీయమైన పునరాభివృద్ధి చెందుతున్నాయి. వీటిని అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్‌లోని టొక్యో నగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. హాంబర్గ్‌లోని హాఫెన్‌సిటీ ఒక ముఖ్యమైన పట్టణ పునరుజ్జీవన ప్రాజెక్ట్. దీన్ని ఓడరేవు ఆధారంగా అభివృద్ధి చేశారు. చైనాలోని చాంగ్‌కింగ్ పట్టణం వేగవంతమైన జనాభా పెరుగుదల ఆధారంగా అభివృద్ధి చేశారు. సింగపూర్‌లో ఫారెస్ట్ సిటీని అభివృద్ధి చేశారు.
వీటి ఆధారంగానే..
హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, ఆధునీకరణ వంటి అంశాల ఆధారంగా రీ డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ సిటీలో జనాభా పెరిగిపోయింది. దీంతోపాటు నగరం ప్యాక్ అయింది. కొత్తగా హౌసింగ్ ప్రాజెక్టులు వచ్చే అవకాశంలేదు. పైగా హైదరాబాద్ అంటే ఒకప్పుడు సికింద్రాబాద్, పాతబస్తీ చెప్పుకునేవారు. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, మాదాపూర్ ఒక్క మాటలో చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని ప్రాంతాల గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని రీ డెవలప్‌మెంట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మురికివాడల అభివృద్ధి, బహుళా అంతస్తుల భవనాల నిర్మాణం, కమర్షియల్ ఏరియాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతాల అభివృద్ధి చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
మూసీ పునరుజ్జీవనం
హైదరాబాద్ నగరంలో మూసీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే మూసీ పునరుజ్జీవనం పేరుతో అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. మూసీ 55 కిలోమీటర్ల మార్గంలో రెండు వైపుల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లంగర్ హౌస్‌లోని బాపుఘాట్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకు సంబంధించిన డీపీఆర్ పనులు జరుగుతున్నాయి. మూసీతోపాటే కోర్ సిటీ రీ డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని పలు నగరాల్లో ఓడరేపుల ఆధారంగా రీ డెవలప్‌మెంట్ చేశారు. వాటి మాదిరిగానే హైదరాబాద్‌లో మూసీ ఆధారంగా నగరాన్ని రీ డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని అధికారులు చెబుతున్నారు.






