హస్తం పార్టీలో కొత్త కమిటీల జోష్.. డీసీసీ అధ్యక్షుల మార్పు!

by Kema Shiva Kumar |

కాంగ్రెస్​ పార్టీ సంస్థాగతంగా అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలు వేయాలని నిర్ణయించింది.

హస్తం పార్టీలో కొత్త కమిటీల జోష్.. డీసీసీ అధ్యక్షుల మార్పు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ సంస్థాగతంగా అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలు వేయాలని నిర్ణయించింది. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను రాబోయే మూడు వారాల్లో ఏర్పాటు చేయనున్నది. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ ప్రణాళిక రచించింది. దీని కోసం ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులను నియమించనుంది. వీరు క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పీసీసీ, ఏఐసీసీకి అందించనున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా కాంగ్రెస్​ కమిటీ(డీసీసీ)లకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్​గౌడ్‌లు ఇరువురు కలిసి చర్చించినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా శుక్రవారం ఆదర్శనగర్​ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్​భేటీ అయ్యారు.

తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై వీరిరువురు చర్చించారు. ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఒకటి రెండు రోజుల్లో జిల్లాలకు ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులను నియమించనున్నారు. అనంతరం పార్టీ బూత్​స్థాయి కమిటీల నియామకం చేపట్టనున్నారు. ఆ తర్వాత గ్రామ, బ్లాక్, మండలాధ్యక్షుల ఎన్నికలను పూర్తి చేస్తారు. స్థానిక పార్టీ కేడర్​అభిప్రాయాల సేకరణ ప్రకారం ఈ నియామకాలు ఉండనున్నాయి. బలవంతపు నియామకాలు అసలే ఉండవని తెలుస్తోంది. అదే సమయంలో సామాజిక న్యాయం పాటించేలా చూడనున్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ కనీసం 50 శాతానికి పైగా ఉండేలా చూస్తారని టాక్. మహిళలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం సాగుతోంది.

డీసీసీల మార్పు..

డీసీసీ నియామకాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇకపై పార్టీలో డీసీసీలు కీ రోల్​పోషించనున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులను మార్చాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిలో భాగంగా కొత్త వారిని ఎంపిక చేసేందుకు ఏఐసీసీ ప్రత్యేకంగా పరిశీలకులను నియమించనుంది. ఇటీవల గుజరాత్‌లో ఇదే తరహాలో డీసీసీ అధ్యక్షులను నియమించడానికి ఏఐసీసీ స్వయంగా పరిశీలకుల జాబితాను రూపొందించి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సైతం ఒకటి రెండు రోజుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులను ఇక్కడ ఏఐసీసీ పరిశీలకులుగా నియమిస్తారు. వీరికి తోడుగా పీసీసీ సైతం జిల్లాలకు పరిశీలకులను నియమించనుంది. వీరు ఇరువురు కలిసి జిల్లాల్లో పర్యటించి అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు, మండలాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్​అధ్యక్షులు, ముఖ్య నాయకుల ద్వారా ఎవరైతే డీసీసీ అధ్యక్షుడిగా ఫిట్ అని భావిస్తారో అభిప్రాయాలను సేకరిస్తారు. వారి గత చరిత్రను, పార్టీ పట్ల నిబద్ధతను పరిశీలించి పీసీసీ 3 నుంచి 5 గురి పేర్లను సిఫార్సు చేయనుంది.

సామాజిక న్యాయానికి పెద్దపీట

అక్కడ మరో సారి వడపోత తర్వాత ఏఐసీసీకి ముగ్గురి పేర్లతో జాబితాను పంపిస్తారు. ఏఐసీసీ ఆ ముగ్గురిని పిలిపించి ఇంటర్వ్యూ చేసి అక్కడ తుది నిర్ణయం తీసుకుని వారు పేర్లను అధికారికంగా ప్రకటించనుంది. ఇక్కడ కూడా సామాజిక న్యాయానికి పెద్ద పేట వేస్తారని టాక్. పార్టీ పట్ల ఎవరైతే కమిట్‌మెంట్‌తో ఉంటారో వారికే చాన్స్ దక్కనుంది. సీనియర్లకు కూడా చాన్స్ ఇవ్వాలని ప్రాథమికంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

డీసీసీలతో పార్టీ కార్యకలాపాలు

డీసీసీల ద్వారానే పార్టీ కార్యకలాపాలు జరగనున్నాయి. వారిచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారానే పార్టీ నిర్ణయాలు ఉండనున్నాయి. వారిచ్చే సమాచారంతోనే ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల జాబితాను ఖరారు చేస్తారని సమాచారం. అందుకే ఇప్పుడున్న డీసీసీలను మారుస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో జరిగినందున నేతలంతా ఫాలో అవుతారని, ఎవరూ వ్యతిరేకించే అవకాశం లేదని టాక్. రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. డీసీసీల నియామకం జరిగాక పీసీసీ కార్యవర్గాన్ని ఫైనల్​చేయనున్నారు. ఇదంతా రాబోయే మూడు వారాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 కల్లా కాంగ్రెస్‌కు అన్ని స్థాయిల్లో నూతన కమిటీలు ఏర్పాటు అవుతాయని, అప్పుడు పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టి పెట్టొచ్చని రాష్ట్ర నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

Next Story