కొత్త చైర్మన్ల కొత్త డిమాండ్లు.. అధికార హోదా కోసం ఆరాటం

by Naga Rani Yarlagadda |

ఇటీవల సర్కారు నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు అధికార దర్పం ప్రదర్శించుకునేందుకు తహతహలాడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

కొత్త చైర్మన్ల కొత్త డిమాండ్లు.. అధికార హోదా కోసం ఆరాటం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల సర్కారు నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు అధికార దర్పం ప్రదర్శించుకునేందుకు తహతహలాడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది చైర్మన్లు మంచి ఆఫీసు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం తమకు సన్నిహితంగా ఉండే మంత్రుల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. మెజార్టీ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేయడంతో వాటికి ఆఫీసులు ఎక్కడ కేటాయించాలని సంబంధిత శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

అధికార దర్పం కోసమే..

తాజాగా నామినేటెడ్ పదవులు దక్కించుకున్న చైర్మన్లు అధికారం దర్పాన్ని ప్రదర్శించే ఆరాటపడుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. మంచి ఏరియాలో ఆఫీసు, వెనకాల గన్‌మెన్లు ఉంటే తమను కలిసేందుకు వచ్చే కార్యకర్తల ముందు హుందాగా వ్యవహరించొచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. మెజార్టీ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటవ్వగా.. ఎక్కువ కార్పొరేషన్లు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తున్నాయి. దీంతో కొత్త కార్పొరేషన్లకు ఆఫీసులను ఎక్కడ కేటాయించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని ఆఫీసులను బీఆర్కే భవన్‌, మరికొన్నింటిని సంక్షేమ భవన్‌లో కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఎక్కువ మంది చైర్మన్లు బీఆర్కే భవన్‌లోనే తమకు ఆఫీసు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే సమీపంలోనే సెక్రెటేరియట్ ఉండటంతో మంత్రులు, అధికారులను కలవడానికి సులువుగా ఉంటుదని వారంతా భావిస్తున్నట్టు తెలిసింది. అందుకోసం తమకు సన్నిహితంగా ఉన్న మంత్రుల వద్దకు వెళ్లి ‘అన్న.. ఓ మంచి ఆఫీసు ఇప్పించు.. అలాగే ఓ ఇద్దరు గన్ మెన్లను కూడా కేటాయించాలని డీజీపీకి ఫోన్ చేసి చెప్పండి’’ అంటూ పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మంచి జీతం సైతం..

ముందు ఆఫీసు, ఆ తర్వాత గన్‌మెన్లను ఇప్పించాలని కోరుతున్న చైర్మన్లు.. మంచి జీతం సైతం ఇప్పించాలని మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. కాగా, చైర్మన్లకు ఎంత జీతం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, మెజార్టీ చైర్మన్లు మాత్రం కనీసం రూ.లక్ష జీతం ఇస్తారని ఆశతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొందరు చైర్మన్లు అయితే వెహికల్ ఇస్తారా? అని కూడా అడుగుతున్నట్లు టాక్. మరికొందరైతే ‘‘జీతం ఇచ్చినా ఇవ్వకున్న ఏం పర్లేదు. కనీసం గన్‌మెన్లను ఉండాలి’’ అని అప్పీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గన్‌మెన్లు ఉంటే క్షేత్రస్థాయిలో తమకు రాజకీయంగా పరపతి పెరుగుతుందనే భావనలో సదరు చైర్మన్లు ఉన్నట్టు తెలుస్తున్నది.

Next Story