- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం శాఖల్లో అధికారుల నిర్లక్ష్యం.. కొర్రీలతో పేరుకుపోతున్న ఫైళ్లు
స్వయానా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలవి.. ఒక రకంగా నగర అభివృద్ధికి కీలకమైనవి.

దిశ, తెలంగాణ బ్యూరో: స్వయానా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలవి.. ఒక రకంగా నగర అభివృద్ధికి కీలకమైనవి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నతమైన బాధ్యతల్లో ఉన్నారు. కానీ ప్రజాసమస్యలపై తమ పేషీలకు వచ్చే ఫైల్స్‌ను నెలల తరబడి క్లియర్ చేయడం లేదు. ‘నేను పనిమంతుడినే.. పైరవీలకు తావులేదు. పైసలు అసలే ముట్టను’ అంటూ ఐఏఎస్ అధికారులు తమకు తాము డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ ఫైళ్లను అస్సలు ముట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరు అసలు దరఖాస్తుదారులనే కలవరు. మరొకరు కలిసినా ఫైళ్లను ముట్టుకోరు. మరొకరైతే ముట్టినా కొర్రీల మీద కొర్రీలు పెడుతూ పక్కనపడేస్తారనే అభిప్రాయం ఉన్నది.
ఐఏఎస్, ఐపీఎస్‌లు బాధ్యతల్లో ఉన్నా..
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖను రాష్ట్ర ప్రభుత్వం రెండు విభాగాలుగా విభజించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా టీకే శ్రీదేవి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్ మెంట్ కార్యదర్శిగా ఇలంబర్తిని నియమించింది. ఈ రెండు శాఖల పరిధిలో 12 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హెచ్ఎండీఏలో ఇద్దరు, జీహెచ్ఎంసీలో ఐదుగురు, జలమండలిలో ఇద్దరు, ఎంఆర్డీసీఎల్‌లో ఇద్దరు, టీయూఎఫ్ఐడీసీలో ఎండీతో పాటు మరొకరు, ఎఫ్‌సీడీఏలో ఒకరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీరితో పాటు హైడ్రాలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్‌లో సింహాభాగం ఉన్నారు.
చిక్కరు.. దొరకరు!
12 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నా వీరిలో సగం మంది మాత్రమే పనిచేస్తున్నారని, మిగతా వారు కాలయాపన తప్ప పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో కీలక ఓ విభాగానికి చెందిన అధికారి మాత్రం ప్రజలకు చిక్కడు దొరకడు. ఎప్పుడు ఏ ఆఫీసులో ఉంటారో ఆయనకే ఎరుక. దరఖాస్తుదారులు గంటల తరబడి వెయిట్ చేసి విసిగివేసారి వెళ్లిపోవాల్సిందే తప్ప కలిసే పరిస్థితి ఉండదు. పైగా మీటింగ్‌ల పేరుతో ఫైళ్లను పట్టించుకోకపోవడంతో పాటు కొర్రీలు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరో అధికారి తీరుపై సొంత శాఖ ఉద్యోగులే గుర్రుగా ఉన్నారు. ఫైళ్లు ముట్టరు.. ఇక వేళ చూసినా కొర్రీలతో పక్కనబెడుతున్నారని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆయన ఆఫీసులో ఉన్నారా? ఉంటారు? ఏం పని ఉందిలే’ అంటూ నిట్టూర్చుతున్నారు. మరో కీలక విభాగమైన జీహెచ్ఎంసీలోనూ ఐదుగురు ఉన్నారు. వీరిలో కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయం ఉంది. మరో ఇద్దరైతే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టిచూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఇద్దరు అధికారులపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. వీరిపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. రాజకీయ కారణాలతో ఫైళ్లను ముట్టడంలేదని చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. ఫైళ్లు పేరుకుపోయినా పట్టించుకోరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
జోడు పదవులతో ఇబ్బందులు
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలో ఆరుగురు ఐఏఎస్ అధికారులకు జోడు పదవులు ఉన్నాయి. వీరిలో సీనియర్ అధికారులు తప్ప జూనియర్ అధికారులు ఒక్క పోస్టుకే న్యాయం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఓ యువ అధికారి వద్దకు ఫైల్ పోతే నెలరోజుల తర్వాతే క్లియర్ అవుతున్నది. రూ.10 వేల ఫైల్ అయినా, రూ.10 కోట్ల ఫైల్ పోయినా ఆలస్యమే. ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైల్ పంపిస్తే ఇక అంతే సంగతులు. ఆయనకు నచ్చిన పనిని మాత్రం ఆగమేఘాల మీద చేయిస్తారనే అపవాదు ఉంది. మరో కీలక పోస్టులో ఆఫీసర్ వద్ద కూడా ఫైల్ మూలన పడాల్సిందే. మరో అధికారికి ఉన్న పోస్టు కీలకమంటే ప్రభుత్వం అదనపు పోస్టు కట్టబెట్టింది. ఇక ఏ ఆఫీసులో ఎవరు ఉంటారో చెప్పడం కష్టమే.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో మూడు విభాగాల నుంచి ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తోంది. అలాంటి విభాగంలోనూ ఫైళ్లను పెండింగ్ పెట్టి కాలయాపన చేయడంతో ఆదాయానికి గండిపడుతున్నదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా ఆన్ లైన్ అని చెబుతున్నా ఆఫీసుకు రావాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆఫీసుకు వస్తేనే పనికావడం లేదంటే రాకపోతే ఇంకేముంటుందని వాపోతున్నారు.






