- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టు కేసులతో ముందుకు సాగని నీట్ పీజీ స్టేట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలో వైద్య విద్య పరిస్థితి గందరగోళంగా మారింది. ఏటా నీట్ పీజీ కౌన్సిలింగ్ సమయంలో తెలంగాణ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వైద్య విద్య పరిస్థితి గందరగోళంగా మారింది. ఏటా నీట్ పీజీ కౌన్సిలింగ్ సమయంలో తెలంగాణ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నీట్ పీజీ రెండు దశల కౌన్సిలింగ్ (ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్) లో పాల్గొనేందుకు మిగతా రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగా తెలంగాణ విద్యార్థులకు అవకాశం లేకుండా పోతోంది. కోర్టు కేసుల పేరిట కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఏ మాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరించడంతో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభమే కాకుండా పోయి... తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీ వంటి ఎంతో మెరుగైన పీజీ సీట్లను కోల్పోవాల్సి వస్తోందని కేయూలో పీజీ జనరల్ మెడిసిన్ లో సీటు వచ్చిన ఓ విద్యార్థి వాపోయారు. తమ కౌన్సిలింగ్ పై అటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు గానీ ఇటు ప్రభుత్వానికి గానీ ఏమాత్రం శ్రద్ధ లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని ఆ విద్యార్థి వాపోయారు. అయితే కోర్టు తీర్పు పేరిట కౌన్సిలింగ్ ఆలస్యం చేయడంతో ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) ర్యాంకులతో సీట్లు పొందిన నీట్ పీజీ అభ్యర్థులు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) స్టేట్ కౌన్సిలింగ్ కోసం రాజీనామా (సీట్ విత్ డ్రా) గడువు డిసెంబరు3తో ముగిసిపోయింది. అయినా ఇంకా తెలంగాణ మాత్రం స్టేట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించలేదు. ఉన్న సీటును ఉంచుకునాలో... స్టేట్ కౌన్సిలింగ్ లో మంచి సీటు కోల్పోవాల్సి వస్తుందని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నేటికీ సీట్ మ్యాట్రిక్స్ ప్రకటించకపోవడంతో విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.
కోర్టు కేసుల పేరిట...
కోర్టు కేసులు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదాల కారణంగా కౌన్సిలింగ్ ఆలస్యం అవుతోందని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు కూడా నాన్ లోకల్ గా పరిగణిస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు జారీ చేసిన ప్రాస్పెక్టస్ కారణంగా తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో తెలంగాణలోని మెడికల్ కాలేజీలో సీటు వచ్చినా సదరు ఎంబీబీఎస్ విద్యార్థి పీజీలో చేరేప్పుడు నాన్ లోకల్ అని పేర్కొనడంతో పలువురు విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే ఆ విద్యార్థిని వారి వారి రాష్ట్రాలు సైతం నాన్ లోకల్ గా చూపించాయి. సదరు అదర్ స్టేట్ విద్యార్థి తెలంగాణలోనే 4 ఏళ్లకు పైగా ఎంబీబీఎస్ చదివినా... ఇక్కడ కూడా నాన్ లోకల్ గానే పరిగణించారు. దీంతో అలాంటి విద్యార్థులు సైతం తాము తెలంగాణలో 4 ఏళ్లకు పైగా చదువుకున్నామని... ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం తాము కూడా లోకల్ అభ్యర్థులుగా పరిగణించాల్సిందేనని కోర్టు తలుపు తట్టారు. వీరందరినీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో లోకల్ అభ్యర్థులుగానే పరిగణించింది.
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల...
బుధవారం రాష్ట్రానికి సంబంధించిన నీట్ పీజీ విద్యార్థుల ఫైనల్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రం నుంచి 3158 మంది అభ్యర్థుల జాబితాను అధికారులు వెలువరించారు. వీరిలో దాదాపు 70 మంది వరకు కోర్టు తలుపులు తట్టి తుది మెరిట్ లిస్టులో స్థానం సంపాదించారు. అయితే స్థానికత అర్హత అనేది రిట్ పిటిషన్ యొక్క తుది ఫలితానికి లోబడి ఉంటుందని కోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొనడంతో మళ్లీ తుది తీర్పు ఏమని వస్తుందో అనే సందేహంలో అభ్యర్థులున్నారు. ఇది ఇలా ఉంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కు సమాంతరంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా... నేటికీ అది ప్రారంభమే కాలేదు. దీంతో ఇప్పటికే ఆల్ ఇండియా కోటా ద్వారా పీజీ సీటు వచ్చిన విద్యార్థులు వాటిని వదులుకుని స్టేట్ కోటాకు ప్రయత్నించేందుకు అవకాశం లేకపోయింది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఆల్ ఇండియా కోటా సీటు తోనే ఆగిపోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు, ప్రభుత్వం సమాలోచన చేసి పూర్తి నివేదికతో కోర్టు తలుపుతట్టి రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేయాల్సి ఉంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడంతో తాము రాజీనామా చేయలేకపోతున్నామని... ఒకవేళ రాజీనామా చేస్తే స్టేట్ సీటు కూడా పోతుందేమోనన్న భయమేస్తోందని చెబుతున్నారు. ఏఐక్యూ ర్యాంక్ ఆధారంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి కాలేజీల్లో సీటు పొందాలని ఉన్నా... స్టేట్ కౌన్సెలింగ్ లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేని దుస్థితి అని మరో విద్యార్థి వాపోయారు.
ఎట్టకేలకు ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల...
సెప్టెంబర్ 30న పీజీ కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ వెలువడినా... కోర్టు కేసుల వల్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందని కాళోజీ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. బుధవారం మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఏఐక్యూ నుంచి బయటకు రావాలనుకునే అభ్యర్థులకు అవకాశాలు కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే నేటికీ కనీసం సీట్ మ్యాట్రిక్స్ కూడా వెలువడకపోవడంతో విద్యార్థుల్లో గందరగోళం మాత్రం కొనసాగుతోంది. ఏటా అన్ని రాష్ట్రాలు సకాలంలో స్టేట్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఎప్పుడూ ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో మన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.
కనీసం ఇంచార్జి వీసీని కూడా నియమించరా...
రాష్ట్రంలో సుమారు 6వేలకు పైగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియలో మన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే వీసీ రాజీనామా చేసినా... ఇప్పటికిప్పుడు కనీసం ఇంచార్జి వీసీని నియమించే అంశంపై ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో 3158 మంది విద్యార్థుల భవితవ్యంపై ప్రభుత్వం పట్టించుకునాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వైద్య విద్య అంటేనే ఎంతో సంక్షిష్టమైంది... అందునా పీజీ సీటు కోసం ఉన్న పోటీ మామూలుగా ఉండదు. ఎంతో కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకున్నా... ర్యాంకులకు తగ్గట్లుగా సీట్లు పొందేందుకు అవకాశం లేకుండా పోతోందని విద్యార్థులు వాపోతున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేని సమస్యలన్నీ తెలంగాణలోనే ఉన్నాయంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా కౌన్సిలింగ్ క్రమపద్ధతిలో జరగడం వల్ల ఆయా రాష్ట్రాల విద్యార్థులు తమకు దక్కాల్సిన సీట్లు పొందుతున్నారు. తెలంగాణలో మాత్రం ఏటా పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియలో కోర్టు కేసుల పేరిట ఆలస్యం చేస్తూ మన విద్యార్థుల భవితవ్యాన్ని అగమ్యగోచరంగా మార్చేస్తున్నారు. తెలంగాణ వచ్చిందని సంతోషపడాలో తమకు ఏటా అన్యాయం జరుగుతోందని బాధ పడాలో అర్థం కావడం లేదని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
- Tags
- Neet Pg seats






