నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం

by Gantepaka Srikanth |

తెలంగాణ కవి, రచయిత, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది.

నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కవి, రచయిత, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని పరిస్థితులపై ఆయన ఈ పుస్తకాన్ని రచింంచారు. తాజాగా నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ పెట్టారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి తన తరపున మరియు పార్టీ తరపున అభినందనలు తెలియజేశారు. ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి ఎన్నో పరిశోధనలు చేసి, తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారని కేటీఆర్ పేర్కొన్నారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన ఆయన కృషి మరువలేనిదన్నారు. ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజా కవిగా ఆయనను కేటీఆర్ అభివర్ణించారు. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సిధారెడ్డి గెలుచుకోవడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఆయనకు ఈ పురస్కారం దక్కడం సముచితమని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు.

Next Story