మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు : మంత్రి కోమటిరెడ్డి

by Bhanu |   (  Updated:2025-05-20 12:21:01  IST  )

మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు : మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, నకిరేకల్ టౌన్ : మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కట్టంగూరు మండలంలోని అయి టిపాముల గ్రామంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటుచేసిన "స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ల" ను ప్రారంభించి , స్వచ్ఛ శక్తి కేంద్రం, మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేసి ఆయన మాట్లాడారు. సౌర శక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించుకునేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా అటిపాములలో మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

అమెరికా, జపాన్ లాంటి దేశాలు న్యూక్లియర్ ,థర్మల్ విద్యుత్తును పక్కన పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వెళుతున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలు ఇంటి వద్దనుండే ఆదాయం పొందేందుకు సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలను లక్షాధికారులుగా చేయాలనే ఆలోచనతో ఆర్థిక సాయం అందించడం జరిగిందని, అదే సమయంలో తాను శాసనసభ్యుడిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు 350 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, స్వశక్తితో మహిళలు పైకి రావాలనే ఉద్దేశంతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 మంది స్వయం సహాయక మహిళలకు 50 లక్షల రూపాయలను ఇచ్చి యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు .అలాగే త్వరలోనే ఈ 50 మంది మహిళలకు బ్యాంకుల ద్వారా మూడు లక్షల రూపాయల చొప్పున బ్యాంకు రుణాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు చొప్పున జూన్ 2 న స్వయం ఉపాధి కై ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.రానున్న రెండు నెలల్లో

ఐటిపాముల మాదిరిగానే నల్గొండ మండలం, చర్లపల్లి గ్రామంలో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ రెండు గ్రామాలను తెలంగాణలోని ఇతర ప్రాంతాల వారు వచ్చి చూసే విధంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా, మహిళలు, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల లో భాగంగా ఐటిపాములకు 100 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మహిళలకు 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ మహిళలు ఇంట్లో కూర్చుని సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా నెలకి కనీసం 2000 రూపాయల ఆదాయం సంపాదించవచ్చన్నారు. ఐటిపాములలో ప్రభుత్వం ద్వారా కోటి రూపాయలపైనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అంతేకాక అడిగిన వెంటనే మనజిల్లామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 కోట్ల రూపాయల ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ను మంజూరు చేయించారని, పైపులైన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు..70 కోట్ల రూపాయల తో మూసి వరకు కెనాల్ లైనింగ్ పనులు నడుస్తున్నాయని ఆయన తెలిపారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళలు కాలు బయట పెట్టకుండా ఇంటి నుండే ఆదాయాన్ని సంపాదించేలా సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అమే

కోరారు. ఈ సోలార్ విద్యుత్తు బ్యాటరీ జీవితకాలం సుమారు 10 సంవత్సరాలు ఉంటుందని, 3000 సైకిల్స్ ఈ బ్యాటరీ పని చేస్తుందని దశాబ్ద కాలం వరకు బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదని అన్నారు.సోలార్ విద్యుత్ బ్యాటరీ యూనిట్లను జాగ్రత్తగా భద్రపరచుకునే బాధ్యత మహిళలపై ఆధారపడి ఉందని, ఆమె తెలిపారు. ఐటిపాములలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ బ్యాటరీలను ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసేందుకు ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి,డి సి ఎం ఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, ఇంచార్జ్ రెవిన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,మండల ప్రత్యేక అధికారి ,జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, స్వేచ్ఛ శక్తి కేంద్ర సిఈఓ సుధాకర్ తహసిల్దార్ ప్రసాద్ , ఎఫ్ పిఓ చైర్మన్ చౌగొని సైదమ్మ మాజీ ఎంపీపీలు రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర్, కొండ లింగస్వామి మాజీ జెడ్పిటిసిలు సుంకరబోయిన నరసింహ, మాద యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, తదితరులుపాల్గొన్నారు.

Next Story