అభివృద్ధి చేశాం..చెప్పుకోలేకపోయాం... అందుకే ఓడిపోయాం

by Sridhar Babu |
అభివృద్ధి చేశాం..చెప్పుకోలేకపోయాం... అందుకే ఓడిపోయాం
X

దిశ,తుంగతుర్తి : పదేళ్లలో ఎంతో కష్టపడుతూ అభివృద్ధి పనులలో విజయం సాధించినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకపోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు అబద్దాలతో ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైందని, ఫలితంగా శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకుండా ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన క్యాడర్ కు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం తుంగతుర్తి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు.

గెలుస్తామనే ధీమా అతిగా ఉండడం కూడా ఓటమికి మరో కారణమైందన్నారు. ఇదిలా ఉంటే తమ స్వలాభాల కోసం కొంత మంది దొంగలు తెల్ల బట్టలు వేసుకొని కల్ల బొల్లి మాటలతో పక్కనే కూర్చుంటూ డబ్బులు సంపాదించుకొని మోసం చేశారని పార్టీని వీడిన వారిని ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ ద్వారా లబ్ధిపొందిన వారంతా చిన్న కొడుకైన రేవంత్ రెడ్డి చేతిలో మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కొనసాగుతోందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడ్డ మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.

రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి ఏమీ లేదని,కేవలం పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి సాధ్యపడిందని వివరించారు. స్పీడ్ గా వచ్చిన మార్పు మళ్లీ స్పీడ్ గానే వెనక్కి పోతోందని కాంగ్రెస్ ను ఉదాహరిస్తూ వివరించారు. ఏడాది తిరిగేలోగా మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. రాకేష్ రెడ్డి ని గెలిపించి సత్తా చాటుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీశైలం, నాయకులు గుండగాని రాములు, తునికి సాయిలు, దొంగరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story