మగపిల్లలపై ప్రేమతోనే బాలుడి కిడ్నాప్.. సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

by Bhanu |

కిడ్నాప్ కు గురైన బాలుడిని నిందితుల చెరనుంచి తప్పించి నల్లగొండ పోలీసులు సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివారాంరెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

మగపిల్లలపై ప్రేమతోనే బాలుడి కిడ్నాప్.. సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
X

దిశ, నల్లగొండ క్రైం: కిడ్నాప్ కు గురైన బాలుడిని నిందితుల చెరనుంచి తప్పించి నల్లగొండ పోలీసులు సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివారాంరెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మిర్యాలగూడెం మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బైరం అంజిబాబు-భాగ్యలక్ష్మి దంపతులకు సుమారు 20నెలల వయస్సున్న సోమేశ్వర కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భాగ్యలక్ష్మి 8నెలల గర్భవతిగా ఉంది. అయితే.. ఆమెకు అనారోగ్య సమస్యతో ఈనెల 8న ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఈమెకు కేర్ టేకర్ గా ఆసుపత్రికి వచ్చిన కుచం పార్వతమ్మ ఆసుపత్రి ఎదుట బాలుడు సోమేశ్వర్ ను ఆడిస్తోంది.

హైదరాబాద్ లోని దమ్మాయిగూడకు చెందిన నారాయణదాసు అరుణ, జంతిక సుక్కమ్మ ఇరువురు పార్వతమ్మతో ఆసుపత్రి ఆవరణలో పరిచయం పెంచుకున్నారు. పార్వతమ్మకు భోజనం చేయడానికి వెళ్లగా, అరుణ, సుక్కమ్మ సోమేశ్వర్ ను కిడ్నాప్ చేశారు. బాధితులు వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగొండ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆసుపత్రి సీసీ ఫుటేజీ పరిశీలించి, బస్ స్టాండ్ లో విచారణ జరిపి సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను గుర్తించారు. గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామంలో సుగుణ తల్లి గారింటి వద్ద నిందితులను పట్టుకుని, బాలుడిని సురక్షితంగా నల్లగొండకు తీసుకొచ్చారు.

కొడుకు ఆత్మహత్య.. మగ పిల్లలపై ఆశతోనే

నారాయణదాసు సుగుణ కుమారుడు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె ఎలాగైనా మగపిల్లలపై ప్రేమతో, ఒక బాలుడిని తీసుకుని వచ్చి పెంచుకోవాలని దురాలోచనతో ఉండేది. దమ్మాయిగూడలో తాను నివసిస్తున్న ఇంటి పక్కన గల మరో జంతిక సుక్కమ్మతో ఈ విషయం చెప్పగా, వారిద్దరు కలిసి నల్లగొండ బస్ స్టాండ్, ఆసుపత్రి ఏరియాలో చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉంటారు. వారి తల్లి తండ్రులు లేని సమయం చూసి పిల్లవాడిని కిడ్నాప్ చేసి ఎవరికి తెలియకుండా హైదరాబాద్ కు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల10న నేరస్తులు ఇద్దరు కలిసి నల్లగొండ గవర్నమెంట్ ఆసుపత్రిలో బాలుడిని కిడ్నాప్ చేశారు. కానీ, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసును డీఎస్పీ శివరాం రెడ్డి అధ్వర్యంలో ఛేదించిన టూ టౌన్ సీఐ రాఘవ రావు, నార్కెట్ పల్లి సీ‌ఐ నాగరాజు, నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ సైదులు, ఎస్ఐ సతీష్, భువనగిరి పట్టణ సీ‌ఐ రమేశ్, హెడ్ కానిస్టేబుల్ రాజు పి.రాజు, కానిస్టేబుల్ సాగర్ల శంకర్, లావూరి బాలకోటి, జానకి రామ్, తిరుమలేష్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

Next Story