- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదాడలో రెచ్చిపోతున్న ఆకతాయిల ఆగడాలు
కోదాడ పట్టణంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చట్టం ఉందనే భయం లేకుండా, ప్రాణాల విలువ తెలియని మైనర్లు హైవేలనే స్టంట్ యార్డులుగా మార్చేస్తున్నారు.

దిశ, కోదాడ : కోదాడ పట్టణంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చట్టం ఉందనే భయం లేకుండా, ప్రాణాల విలువ తెలియని మైనర్లు హైవేలనే స్టంట్ యార్డులుగా మార్చేస్తున్నారు. జాతీయ రహదారులపై అడ్డగోలుగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ట్రాఫిక్ నడుస్తున్న వేళలోనే బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి సింగిల్ వీల్‌పై దూసుకెళ్లడం, వేగంగా వస్తున్న వాహనాల మధ్య విన్యాసాలు చేయడం పరిపాటిగా మారింది. ఒక్క చిన్న తప్పిదం జరిగితే భారీ ప్రమాదం తప్పదన్న విషయాన్ని పూర్తిగా విస్మరించి రచ్చ రేపుతున్నారు. ఈ దృశ్యాలు చూసి వాహనదారులు గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. వీరిలో ఎక్కువమంది మైనర్లే కావడం. లైసెన్స్ లేదు.. హెల్మెట్ లేదు.. అయినా బైకులపై స్టంట్లు చేస్తూ సోషల్ మీడియా వీడియోల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న నిరపరాధుల ప్రాణాలు వీరి విన్యాసాలకు బలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లినా, చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ లోపంతో ఆకతాయిలకు మరింత తెగువ పెరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే, కోదాడలో ఎప్పుడైనా పెను ప్రమాదం చోటుచేసుకునే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, స్టంట్లు చేసే వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని, మైనర్ల తల్లిదండ్రులను బాధ్యత వహించేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ ఆకతాయిల ఆగడాలు మరింత భయంకర రూపం దాల్చుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.






