- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతల ప్రలోభాలు..!
కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రలోభాల రాజకీయం బహిర్గతమైంది.

దిశ, నల్లగొండ బ్యూరో : కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రలోభాల రాజకీయం బహిర్గతమైంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎన్నికల ప్రచారం శనివారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ లో నిర్వహించగా, ఆ ప్రచారానికి భారీగా జనసమీకరణ చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రచారం ముగిసిన వెంటనే అసలు కథ మొదలైంది. ప్రచారానికి వచ్చిన జనానికి డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందరికీ డబ్బులు ఇవ్వకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. డబ్బులు అందని కొందరు జనం, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. “ప్రచారానికి తీసుకొచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారు” అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ గొడవ చోటుచేసుకోగా, పరిస్థితి అదుపు తప్పే స్థితికి చేరింది.ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు దాడికి పాల్పడినట్లు సమాచారం. డబ్బుల పంపిణీకి సంబంధించిన విజువల్స్ బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ప్రజాస్వామ్యం, నైతిక రాజకీయాలపై ప్రసంగాలు.. మరో వైపు డబ్బులు, మద్యం పంచుతూ ఓట్ల వేట…కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నేతల ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందిస్తుందా?మీడియాపై దాడి చేసిన నేతలపై చర్యలు ఉంటాయా?అన్న ప్రశ్నలు ఇప్పుడు కొదాడలో చర్చనీయాంశంగా మారాయి.






