పోలేప‌ల్లి సెంట‌ర్ ను క‌మ్మేసిన ఇటుక బ‌ట్టీల పొగ

by Ratna Kumari |   (  Updated:2026-03-06 12:34:54  IST  )

మండ‌ల ప‌రిధిలోని పోలేప‌ల్లి సెంట‌ర్ స‌మీపంలో అనుమ‌తి లేని ఇటుక బ‌ట్టీలు విచ్ఛ‌ల‌విడిగా న‌డుస్తున్నాయి. ఈ ఇటుక బ‌ట్టీలపై ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పోలేప‌ల్లి సెంట‌ర్ ను క‌మ్మేసిన ఇటుక బ‌ట్టీల పొగ
X

దిశ‌, చందంపేట : మండ‌ల ప‌రిధిలోని పోలేప‌ల్లి సెంట‌ర్ స‌మీపంలో అనుమ‌తి లేని ఇటుక బ‌ట్టీలు విచ్ఛ‌ల‌విడిగా న‌డుస్తున్నాయి. ఈ ఇటుక బ‌ట్టీలపై ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండానే ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని, మైనింగ్ శాఖ అనుమతి లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు, ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా రేగడి మట్టి వినియోగం జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకుండా అట‌వి కలపను వినియోగిస్తున్న‌ట్టు స‌మాచారం. చందంపేట మండ‌ల ప‌రిధిలోని పోలేపల్లి ఎక్స్ రోడ్ ప్రాంతం ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ పలు కిరాణా దుకాణాలు, రకరకాల వ్యాపార సంస్థలు, చికిత్స కేంద్రాలు, చికెన్ సెంటర్లు, పండ్ల బండ్లు ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతిరోజూ భారీగా ఈ సెంటర్‌కు వ‌స్తూ.. పోతుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతానికి అంచున గాగిళ్లాపురం వైపు వెళ్లే ప్రధాన డబుల్ రోడ్ పక్కనే ఇటుక బట్టీలు ఉండటంతో వాటి నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, దూలి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.


ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, వ్యాపారులు, స్థానిక గ్రామాల ప్రజలు ప్రతిరోజూ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రత్యేకంగా చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని ఇటుక బట్టీలపై వెంటనే చర్యలు తీసుకొని ప్రజలను కాలుష్య సమస్య నుంచి కాపాడాలని స్థానికులు రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖ అధికారులను కోరుతున్నారు. ఇటుక బట్టీలు వద్దని పోలేపల్లి గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ తీర్మానాన్ని సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు అందజేసినట్లు వార్డ్ మెంబెర్స్ కొమ్ము మ‌ల్లీశ్వ‌రీ వెంకటయ్య, నాగిళ్ల విజ‌య్ తెలిపారు. అయితే “ప్రతి రోజు ఇటుక బట్టీల నుంచి వచ్చే పొగ, దుమ్ముతో మా ఆరోగ్యం దెబ్బతింటోంది. వెంటనే అధికారులు స్పందించి ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Next Story