- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్.. ఆ డాక్యుమెంట్లతో తిరిగి కొనుగోలు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ లోని పలు సర్వే నెంబర్లలో అప్పట్లో ప్రెస్టేజ్ అవెన్యూ లిమిటెడ్ అనే సంస్థ 900 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో గ్రామపంచాయతీ లేఅవుట్ చేసింది.

దిశ, సంస్థాన్ నారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ లోని పలు సర్వే నెంబర్లలో అప్పట్లో ప్రెస్టేజ్ అవెన్యూ లిమిటెడ్ అనే సంస్థ 900 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో గ్రామపంచాయతీ లేఅవుట్ చేసింది. అయితే ఈ వెంచర్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించి లెక్కలేనంత అవినీతి అక్రమాలకు తెరలేపిన విషయాలు చాలానే చూశాం. అయితే తాజాగా పంచాయతీ అధికారుల సహకారంతో ఇక్కడ 12 ఎకరాలకు పైగా భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కొందరు వ్యక్తులు లేఔట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ప్రెస్టేజ్ అవెన్యూ లిమిటెడ్ లో ప్లాట్లు కొని మోసపోయిన వారంతా ఓ అసోసియేషన్ గా ఏర్పడి సర్వే నెంబర్ 43 లో లేఅవుట్ ను మాడిఫై చేశారు. అయితే ఈ దుర్బుద్ధికి ఆ అసోసియేషన్ సభ్యులే పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ప్లాట్లు కొని మోసపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన అసోసియేషన్ సభ్యులు కొందరు అక్రమార్కులతో చేతులు కలిపి ఈ తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అసలు ఈ పనులన్నింటికీ సూత్రధారిగా ప్రెస్టేజ్ అవెన్యూ లిమిటెడ్ ఎండీ వెంకటేశ్వరరావు దగ్గర పనిచేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ముందుండి నడిపిస్తున్నట్లు సమాచారం. ఈయన సహకారంతోనే ఈ తొమ్మిది వందల ఎకరాల వెంచర్ లో లెక్కలేనన్ని అక్రమాలు, అవినీతి జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాచకొండలో వెంచర్ ఏర్పాటుచేసిన ఈ సంస్థ యజమాన్యంపై విజిలెన్స్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతోనే సదరు సంస్థ ఎండీ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేయించుకొని వచ్చేందుకు అప్పట్లో వెంచర్ లో సూపర్వైజర్ గా పనిచేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తప్పుడు పత్రాలతో తిరిగి రిజిస్ట్రేషన్!
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 43 లో పూర్తి విస్తీర్ణం సుమారు 151ఎకరాల 23 గుంటలు ఉంది.ఈ పూర్తి సర్వే నెంబర్లో 43/1 నుంచి వరుసగా 43/12 సబ్ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 43/4 లో 31 ఎకరాల 26 గుంటలు సీలింగ్ ల్యాండ్ ఉంది. అయితే ఇదంతా బాగానే ఉన్న 2006 సంవత్సరంలో 43/8 సర్వే నెంబర్ లో ఎ.12-25 గుంటలు ఉన్న ఒక రైతు మరో మహిళ పేరు పై 43/8 సర్వే నెంబరుకు బదులు 43/1 అని తప్పుగా వేసి రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా 43/5 లో 4 ఎకరాల 9 గుంటలను ఓ రైతు మరో ఇద్దరికీ 43/ఈ అని వేసి, సర్వే నెం 43/6 లో 4 ఎకరాల 8 గుంటలని సిల్వర్ సాండ్స్ అండ్ షెల్టర్ ఎండీ కి 43/ఈ అని వేసి రిజిస్ట్రేషన్ చేశారు.అంతేకాకుండా సర్వే నెంబర్ 43/7 లో 4 ఎకరాల 9 గుంటలను మరో నలుగురికి 43/ఈ అని తప్పుగా వేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా బాగానే ఉన్న అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు వెంచర్ ఏర్పాటు చేయడానికి సదరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లతో నల్లగొండ ఆర్డీఓ వద్ద వ్యవసాయేతర భూమిగా మార్చమని దరఖాస్తు చేసుకోగ అప్పటి ఆర్డీఓ కేవలం సర్వే నెంబర్ 43 తోనే నాలా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు.దీంతో సర్వే నెంబర్ 43/1 లో ఉన్న అసలు రైతు భూమి వ్యవసాయేతర భూమిగా నమోదు అయింది. దీనికోసం సదరు రైతు లోకాయుక్తను ఆశ్రయించగా 43/1 అని నమోదు చేసుకున్న డాక్యుమెంట్ నకిలీదని గుర్తించి అసలు రైతుకు న్యాయం చేసింది.కానీ 2006 తప్పుగా నమోదు చేసిన డాక్యుమెంట్ లతో 2023 లో మరికొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
2007 కన్వర్షన్ ఆర్డర్ తో 2023 లో రిజిస్ట్రెషన్
2007 సంవత్సరంలో నకిలీ డాక్యుమెంట్ ద్వారా కన్వర్షన్ ఆర్డర్ పొందిన వారు లోకాయుక్త నకిలీదని తేల్చి వారిపై కేసులు నమోదు చేయాలనీ ఆదేశించినట్లు సమాచారం.అయితే అప్పటి నుండి పరారీలో ఉన్న ప్రెస్టీజ్ అవెన్యూ ఎండీ 2023 లో ఓ వ్యక్తికి ఎస్పిఏ ఇచ్చి మరో 9 మంది పేర 12 ఎకరాల 17 గుంటల(60,137 గజాలు) భూమి చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2007 కన్వర్షన్ ఆర్డర్ పెట్టి తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు.దీంతో సదరు తప్పుడు పత్రాలతో వారు డీటీసీపీ అనుమతి కోసం 2024 లోనే దరఖాస్తు చేసుకోగా డ్రాఫ్ట్ అప్రూవల్ వచ్చినట్లు బోర్డు ఏర్పాటు చేసి వెంచర్ పనులు చేస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ సహకారంతోనే!
అప్పటి చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ సహకారంతోనే 60 వేలకు పైగా గజాలను 2007 కన్వర్షన్ ఆర్డర్ తో రిజిస్ట్రేషన్ చేశారు.ఇందుకు గాను భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఇలాంటి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్ లో ప్లాట్లు కొని సామాన్యులు మోసపోకుండా ఉంటుంది. లేదంటే ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినవారు తీవ్రఇబ్బందులు పడక తప్పదు.






