400మంది బాధితులు,100 కోట్ల వసూలు.. మైక్రోఫైనాన్సింగ్ కేసులో వెలుగులోకి సంచలనాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-01 03:03:30  IST  )

అధిక వడ్డీ ఆశచూపి రమావత్ మధు దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసి మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలల కిందట అరెస్టు అయ్యి జైలుకెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ దగ్గర నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పీఏ పల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ మధు కారు డ్రైవర్‌గా పనిచేశాడు.

400మంది బాధితులు,100 కోట్ల వసూలు.. మైక్రోఫైనాన్సింగ్ కేసులో వెలుగులోకి సంచలనాలు
X

దిశ, నల్లగొండ బ్యూరో/పీఏ పల్లి : అధిక వడ్డీ ఆశచూపి రమావత్ మధు దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసి మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలల కిందట అరెస్టు అయ్యి జైలుకెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ దగ్గర నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పీఏ పల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ మధు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. బాలాజీ నాయక్ సైతం అధిక వడ్డీ ఆశ చూపి గిరిజనుల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేశాడు. ఆయన మాదిరిగానే మధు సైతం అత్యధిక వడ్డీ ఆశ చూపి మైక్రో ఫైనాన్స్ పెట్టుబడుల పేరిట రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఇప్పిస్తానని గిరిజనుల (ముఖ్యంగా లంబాడీలు) నుంచి భారీగానే వసూలు చేసినట్టు సమాచారం. సింగర్ మంగ్లీ పేరు వాడుకుని రూ.10 నుంచి రూ.15 వరకు అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. ఆ సొమ్ము దాదాపు రూ.100 కోట్లకు పైనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు.

మాయమాటలతో ఏమార్చి..

పీఏ పల్లి మండలంలోని వద్దిపట్ల చుట్టుపక్కల గల తండా, గిరిజన ప్రాంతంలోని పుట్టంగండి రిజర్వాయర్ రైతులను ఆసరా చేసుకుని పలుగు తండాలో బాలాజీ నాయక్, రమావత్ మధు ఇద్దరూ పోటాపోటీగా విలాసవంతమైన భవనాలను నిర్మించారు. ఖరీదైన కార్లలో హైదరాబాద్ నుంచి ఆ తండాకు వచ్చి వారికి మాయమాటలు చెప్పి నమ్మించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. తమకు హైదరాబాద్, ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయని, ఖరీదైన భూములు, సిమెంట్ కంపెనీలు, వైన్స్‌లు ఉన్నాయని బాధితులను నమ్మించినట్టు సమాచారం. ప్రతి కుటుంబంలో కనీసం నలుగురు సభ్యులు ఉంటే అందులో ముగ్గురు సభ్యులు రమావత్ మధు టీంకు డబ్బులు ఇచ్చిన వాళ్లే. ఒక్కొక్కరు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఇచ్చినట్టు సమాచారం. రూ.10 లక్షలు ఇస్తే ప్రతి నెలా రూ.లక్ష ఫోన్ పే ద్వారా చెల్లిస్తానని మధు టీం గిరిజనులను నమ్మించినట్టు తెలిసింది. డబ్బులు వద్దనుకుంటే ఖరీదైన ప్లాట్లు, విల్లాలు, భవనాలు ఇస్తామని వారిని నమ్మించినట్టు సమాచారం. దీంతో అమాయక గిరిజనులు తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి దగ్గర రూ.రెండు నుంచి రూ.మూడుకు వడ్డీకి తెచ్చి ఈ టీంకు డబ్బులు చెల్లించినట్టు తెలిసింది.

400 మంది బాధితులు..

మొదట్లో వడ్డీ చెల్లించిన రమావత్ మధు టీం.. ఆ తర్వాత చెల్లించకపోవడంతో దాదాపు 400 మంది బాధితులు గుడిపల్లి పీఎస్ మెట్లు ఎక్కారు. అధిక వడ్డీ ఇస్తామంటే డబ్బులు ఇచ్చామని, అందుకోసం రాసుకున్న ప్రామిసరీ నోట్ పత్రాలను పోలీసులకు చూపించారు. దీంతో నిందితులపై నాలుగు కేసులు నమోదయ్యాయి. దేవరకొండ ప్రాంతానికి చుట్టుపక్కల గల పడమటి తండా, పుట్టంగండి, నక్కల పెంట, చింతల్ తండా, పెద్ద గుమ్మడం , నర్లింగ తండా, పిల్లిగుంట తండా, ఎర్రగుంట తండా, ఎర్రగుంట తండా, మునావ తండా, వద్దిపట్ల, తిరుమలగిరి, వడ్డెర గూడెం, పీఏ పల్లి, అంగడిపేట, పెద్దగట్టు, నంబాపురం, మాదాపురం పలు గ్రామాల్లో కలిపి సుమారు 400 మంది అధిక వడ్డీ ఆశలో పడి మోసపోయినట్టు తెలిసింది. మధు అండ్ టీం.. పెద్దవూర, త్రిపురారం, తిరుమలగిరి, మిర్యాలగూడ ప్రాంతాలలో భారీగా వసూలు చేసినట్టు తెలుస్తున్నది. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పీఏ పల్లి మండలం పలుగు తండాలో ఒకరు, మరొక తండాలో ఒకరు.. పెద్దవూర మండలం పాల్తి తండాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

ఆందోళనలో బాధితులు..

అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఇచ్చిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. చుట్టాలు, స్నేహితుల దగ్గర తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మధు టీంకు ఇచ్చామని.. ఇప్పుడేమో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని తమ చుట్టాలు, స్నేహితులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం న్యాయం చేయాలి : రమావత్ చందు, బాధితుడు

‘అధిక వడ్డీకి రూ.48 లక్షలు ఇచ్చి మోసపోయాను. ఈకేసులో భాగమైన రమావత్ మధు, రమావత్ బాలాజీ నాయక్, సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్‌లను కఠినంగా శిక్షించాలి. మేం తెలియక మోసపోయాం. మమ్ములను ప్రభుత్వం పట్టించుకోని మా డబ్బులు మాకు ఇప్పించే విధంగా న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.’

సీఐడీ ద్వారా దర్యాప్తు జరుగుతోంది : కొండమల్లేపల్లి సీఐ

అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసిన రమావత్ మధు టీం కేసు విషయమై పీఏ పల్లి కొండమల్లేపల్లి సీఐను ‘దిశ’ వివరణ కోరగా.. సీఐడీ డిపార్ట్మెంట్ ద్వారా దర్యాప్తు సాగుతున్నదని ఆయన తెలిపారు. బాధితులు ఎక్కువ ఉన్నారని, మరో 210 మంది బాధితులు ఉన్నట్టు మా దృష్టికి వచ్చారని తెలిపారు. రమావత్ రాములు రూ.7 కోట్లు, రమావత్ శివ రూ.4 కోట్లు, రమావత్ హనుమ రూ.5 కోట్లు, రమావత్ హరి సింగ్ రూ.2 కోట్లు, రమావతు ఆర్య రూ.60 లక్షలు, రమావత శివ రూ.కోటి, రమావత్ పంతులు రూ.కోటీ 50 లక్షలు, రామనాథ్ చంటి రూ.30 లక్షలు, రమావత్ వినోద్ రూ.15 లక్షలు మోసపోగా.. కేసు నమోదు చేశామని తెలిపారు. సీఐడీ విచారణలో బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో తేలుతుందన్నారు.

Next Story