ఉపాధి హామీ పనుల పై ప్రజావేదిక..

by Disha Web Desk 20 |
ఉపాధి హామీ పనుల పై ప్రజావేదిక..
X

దిశ, నూతనకల్ : ఉపాధిహామీ పథకం ద్వారా మండలంలో డిసెంబర్ 2019 నుండి మార్చి 2023 వరకు చేపట్టిన పనుల పై సామాజిక తనిఖీ బృందం ఈనెల 8వ తేదీ నుండి, 17వ తేదీ వరకు 17 గ్రామపంచాయతీలలో సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామసభలను నిర్వహించారు. సోషల్ ఆడిట్ లో వచ్చిన సమస్యల పై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ బృందం వివిధ గ్రామాలలో నిర్వహించిన ఆడిట్లో వచ్చిన వాటిని చదివి వినిపించారు. మండల పరిధిలోని బక్కహేమ్లాతండాలో పాతులోతు హాస్లి 2019లో చనిపోగా 2022లో వారం రోజులు పనిచేసి నగదు చెల్లింపులు వచ్చాయని తెలిపారు. ప్రతి గ్రామం నుండి చేసిన పనులలో కొలతల్లో తేడాలు ఉన్నాయని, మస్టర్ ముగిశాక కూడా చెల్లింపులు జరిపారని, ఉపాధి హామీ పనులలో గ్రామపంచాయతీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు పనిచేసినట్టుగా గుర్తించారు. పని జరిగిన ప్రాంతంలో ఉపాధి హామీ బోర్డులు ఏర్పాటు చేయకుండా నిధులు తీసుకున్నారని, కొన్ని గ్రామాలలో ఎంబీ కాకుండా పేమెంట్స్ జరిగాయని సభదృష్టికి తీసుకువచ్చారు.

పనులకు ముందు తర్వాత కొలతలు లేకుండానే చెల్లింపులు జరిగాయని తెలిపారు. కొత్తతండా గ్రామపంచాయతీ పరిధిలోని రెండవసారి మట్టిరోడ్డు పనులకు 4లక్షల 40వేలు చెల్లించారని, రోడ్డు పనులకు రెండుసార్లు ఉపాధి నిధులను వెచ్చించడం ఉపాధి హామీ పథకానికి విరుద్ధమని తెలిపారు. ఎర్రపాడు ఉపాధి హామీ పనులలో ఒకే పనిని 4నెలల వ్యవధిలో రెండుసార్లు పనులు చేసి 4 లక్షల చెల్లింపులు చేశారని చెప్పారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఆర్డీఏ పీడీ ఎస్.కిరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉపాధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీవో, ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు అలసత్వం వహించారని, జరిగిన అవకతవకల పై నోటీసులు అందించి రికవరీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడి పెంటయ్య, ఎంపీపీ భూ రెడ్డి కళావతి సంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి, ఎంపీడీవో ఇందిరా, ఏపీఓ శ్రీరాములు, ఏపీఎం కరుణాకర్, సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed