చేనేత కళా నైపుణ్యం అద్భుతం : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

by Bhanu |

పోచంపల్లి చేనేత ఉత్పత్తులు కేవలం సంప్రదాయ క్రమంలో ఉండకుండా, దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందే స్థాయికి ఎదిగాయని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

చేనేత కళా నైపుణ్యం అద్భుతం : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
X

దిశ, భూదాన్ పోచంపల్లి: పోచంపల్లి చేనేత ఉత్పత్తులు కేవలం సంప్రదాయ క్రమంలో ఉండకుండా, దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందే స్థాయికి ఎదిగాయని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గురువారం ఆయన భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించి మగ్గాలపై చేనేత ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చీరలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయని, ఇటీవల ప్రపంచ సుందరీ మణుల సందర్శనతో 30% అమ్మకాలు పెరగడం గర్వకారణమన్నారు. గతంలో పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకున్న పోచంపల్లి చేనేతను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఎంతో విలక్షణంగా ఉందన్నారు.

చేనేత కార్మికులకు మార్కెటింగ్, డిజైన్, డయింగ్ అంశాల్లో శిక్షణ అవసరమని పేర్కొంటూ, ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. నకిలీ ఇక్కత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా నేతన్న రుణాల కింద ఉపేందర్, భాగ్యలక్ష్మి, యాదగిరికి చెక్కుల పంపిణీ జరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లా నేత కార్మికులకు రూ.2.15 కోట్లు అందించారు.

చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ త్రిఫ్ట్ స్కీమ్, బీమా, రుణ మాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలతో ప్రభుత్వం చేనేత వర్గానికి స్థిరత కల్పించిందన్నారు. పీతాంబరి, సిద్దిపేట గొల్లభామ, ఆర్మూర్ చీరలు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు. పద్మశ్రీ గజం అంజయ్య, గజం గోవర్ధన్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ బలహీనంగా ఉందని, జియో ట్యాగింగ్ ద్వారా కార్మికుల వివరాలను డిజిటల్ చేయాలని సూచించారు. చేనేతకు వ్యవసాయానికి లభించినంత ప్రాధాన్యం రావాలని కోరారు.

బహుళ మంది చేనేత కార్మికులు తమ జీవితాలను చేనేతతో నిర్మించుకున్నట్టు వెల్లడించారు. త్రిఫ్ట్ పథకం వల్ల ఇళ్లను నిర్మించుకున్నవారు, పిల్లల చదువులు కొనసాగించినవారు ఉన్నారు. ఆరోగ్య కార్డుల అవసరాన్ని ప్రస్తావించారు. నకిలీ ఇక్కత్, మార్కెటింగ్ సమస్యలు, శిక్షణలో లోపాలు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వేగంగా పరిష్కరిస్తే, పోచంపల్లి చేనేత ప్రపంచ మార్కెట్‌లో మరింత బలంగా నిలబడగలదని పలువురు అభిప్రాయపడ్డారు.

Next Story