నారాయణ మాయాజాలం.. ధనార్జనే ముఖ్య లక్ష్యం

by Disha Web Desk 9 |
నారాయణ మాయాజాలం.. ధనార్జనే ముఖ్య లక్ష్యం
X

దిశ, సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట పట్టణంలోని నారాయణ జూనియర్ కళాశాల, పాఠశాల యాజమాన్యం నూతన నయాదందాకు తెరలేపారు. ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ స్కూల్, జూనియర్ కాలేజీకి అడ్మిషన్లు తీసుకువాలని వారికి ఆఫర్‌లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అడ్మిషన్లు తీసుకొస్తే వారు అడిగినంత డబ్బు ఇస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల, జూనియర్ కళాశాలలో జాయిన్ చేయించుకుంటే దండిగా ఫీజులు వసూలు చేయవచ్చునని ఈ కొత్త తరహా దందాకు నారాయణ స్కూల్, కళాశాల యాజమాన్యం శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆ యాజమాన్యం పూర్తిస్థాయిలో అడ్మిషన్లు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ తేదీలను అకాడమీ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వమే స్వయంగా ప్రకటిస్తుంది. సర్కార్ ప్రకటించిన తేదీ నుంచి ప్రభుత్వం, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, పాఠశాలలు విద్యార్థుల నుంచి అడ్మిషన్లను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సూర్యాపేట నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ధనార్జనే ధ్యేయంగా..

సూర్యాపేట నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ధనార్జనే లక్ష్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా అడ్మిషన్ ఫీజులను వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ తేదీలను అకాడమీ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వమే స్వయంగా ప్రకటిస్తుంది. సర్కార్ ప్రకటించిన తేదీ నుంచి ప్రభుత్వం, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, పాఠశాలలు విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సూర్యాపేట నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తోక్కి ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అడ్మిషన్ ఫీజులు సైతం ప్రభుత్వం నిర్ణయిం చిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. కానీ నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తుండగా, ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ ఫీజులను రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు వరకు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా విద్యా అకాడమీ ప్రారంభం కాకముందే టెన్త్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి అడ్మిషన్లను తీసుకుంటున్నారు. జిల్లా ఇంటర్మీడియట్, విద్యాశాఖ అధికారులు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం చేతిలో కీలుబోమ్మలుగా మారిపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిబంధనలను పాటించకుండా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతా మోసం..

నారాయణ విద్యాసంస్థలలో టీచింగ్ స్టాఫ్ అందరూ సూర్యాపేట పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులే. అడ్మిషన్ ప్రారంభంలో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఫ్యాక్టలీ చేత ఉత్తమైన టీచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేశామని, వారి చేతనే విద్యార్థులకు విద్య బోధన అందించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లను తీసుకుంటున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సూర్యాపేటకు చెందిన వ్యక్తుల చేత టీచింగ్‌ను చెప్పిస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాకల్టీ అనేది పచ్చి మోసమని గతంలో నారాయణ పాఠశాల, జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు పేర్కొంటున్నారు. అడ్మిషన్లు ఎక్కువ రావడం కోసం హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత విద్యాబోధన అని తమ తల్లిదండ్రులకు చెప్పి నమ్మించారని తీరా అడ్మిషన్లు పొందిన తర్వాత బీఈడీ పూర్తి చేసిన, ఏమాత్రం అనుభవం లేని, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఫ్యాకల్టీని ఎంపిక చేసి తమను మోసం చేశారని గతంలో నారాయణ విద్యాసంస్థల లో చదివిన విద్యార్థులు తెలిపారు. హైదరాబాద్ ఫ్యాకల్టీ ఉత్త బూటకమని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు అడ్మిషన్ల వల

సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో జడ్పీ హైస్కూల్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయల ద్వారా అడ్మిషన్లు వచ్చేలా నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ప్లాన్ చేసింది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒక అడ్మిషన్ తమ పాఠశాల లేదా కాలేజీ కి తీసుకు వస్తే ఆ ఉపాధ్యాయుడికి అడ్మిషన్ కు రూ.20 వేలు కమిషన్ ఇస్తామని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల చుట్టూ ఆ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు తిరుగుతున్నారు. నారాయణ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు మాయమాటలు చెప్పి, నారాయణ జూనియర్ కాలేజీకి అడ్మిషన్లు తీసుకువచ్చే పీఆర్వోలుగా కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సూర్యాపేట మండలంలోని ఓ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ నారాయణ కళాశాలకు పీఆర్వో గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి రూ.రెండు లక్షల ఆఫర్ కేటాయించడంతో ఆ ఆఫర్ తీసుకుని పీఆర్వో గా గా పనిచేస్తున్నాడు. ఒక అడ్మిషన్‌కు రూ. 10 వేల నుంచి రూ. 20 వేలు వస్తుండటంతో ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కేవలం ఆ విద్యార్థులకే ప్రత్యేక బోధన

ఇటీవల వెలువడిన టెన్త్ ఫలితాల్లో నారాయణ పాఠశాలకు చెందిన కేవలం అతికొద్ది మంది విద్యార్థులు మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించారు. గతంలో పదోవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల పట్ల నారాయణ పాఠశాల యాజమాన్యం పక్షపాత వైఖరి చూపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులు 46 మందికి పైగా ఉండటంతో వారిలో ధనిక విద్యార్థులలోని పది మంది విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక తరగతులు, శిక్షణ ఇచ్చారని మిగిలిన విద్యార్థులు పేర్కొంటున్నారు.

తమకు కూడా ప్రత్యేక శిక్షణ, తరగతులు నిర్వహించాలని విద్యార్థుల పాఠశాల యాజమాన్యాన్ని ప్రాధేయపడగా, తమ బాధను ఏమాత్రం పట్టించుకోలేదని, ఫీజులు మొత్తం చెల్లించిన విద్యార్థులపై ఒక వైఖరి, విడతల వారీగా ఫీజులు చెల్లించిన విద్యార్థుల పట్ల మరో వైఖరి చూపారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫీజులు మొత్తం చెల్లించినా పాఠశాల యాజమాన్యం వివక్షత వైఖరి చూపారని అందుకే నారాయణ పాఠశాల విద్యార్థులకు అధిక మొదటి ర్యాంక్ లు రాలేదని ఇప్పటికే నారాయణ పాఠశాల, కళాశాల యాజమాన్యం పైసల కోసం కాకుండా విద్యార్థుల చదువు కోసం ఆలోచించి బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.

Next Story

Most Viewed