- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ అధికారుల మధ్య కమీషన్ల పంచాయతీ..?
ప్రతి పనికి అక్కడ ఒక రేటు.. దాని ప్రకారం రేటు చెల్లించుకోవాల్సిందే.. లేకపోతే రోజుల తరబడి తిరిగిన పని కాదు..

దిశ నల్లగొండ బ్యూరో: ప్రతి పనికి అక్కడ ఒక రేటు.. దాని ప్రకారం రేటు చెల్లించుకోవాల్సిందే.. లేకపోతే రోజుల తరబడి తిరిగిన పని కాదు.. అయితే పని పేరుతో వచ్చిన కమిషన్ల పంపకాలలో శాఖ అధికారి కార్యాలయంలో పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఆ శాఖలో కమిషన్లకు కేరాఫ్ అడ్రస్ గా మారినట్లు తెలుస్తోంది..అదెక్కడో కాదు... జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో...
ప్రతి అగ్రిమెంట్ కు రేటు..?
విద్యుత్ శాఖలో జరిగే ప్రతి కాంట్రాక్టు పనిలో కాంట్రాక్టర్ల నుంచి అధికారులు కమిషన్లు తీసుకోవడం సర్వసాధారణం. బయటికి మాత్రం ..."" అంతా ఆన్లైన్.. పూర్తిగా పారదర్శకంగా టెండర్ల ద్వారా కాంట్రాక్టులు అప్పగిస్తున్నాం.. మేమే నిజాయితీకి గీటురాయి అన్న చందంగా విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. కానీ అంతర్లీనంగా అగ్రిమెంట్ల పేరుతో వచ్చే కమిషన్ల కోసం అధికారుల మధ్య గత కొద్దిరోజులుగా గొడవ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కాంట్రాక్ట్ పని ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిన దానికోసం ఎంత బడ్జెట్ కేటాయించిన అగ్రిమెంట్కు మాత్రం కాంట్రాక్టర్ తప్పకుండా రూ.2000 చెల్లించుకోవాల్సిందే. ఆ సొమ్మును అగ్రిమెంటు పేపర్లు తయారు చేయడంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి అధికారికి కమిషన్ ఇవ్వాల్సిందే..
పంపకాలు ఇలా..?
ఎస్ ఈ- రూ.400
ఎడి - రూ.400
డిఇ( టెక్నికల్)- రూ.400
ఎస్ఎఓ. - రూ.400
ఎఈ. - రూ.200
సబ్ ఇంజనీర్ - రూ.100
కంప్యూటర్ ఆపరేటర్.- రూ.100
1300 అగ్రిమెంట్ సంగతేంటి....?
గత కొన్ని నెలలుగా విద్యుత్ శాఖలో సుమారు 1300 పనులకు సంబంధించిన కాంట్రాక్టు అగ్రిమెంట్లు జరిగినట్లు సమాచారం. వాడితో పాటు ఇంకా సుమారు 1000 పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు శాఖ ఉన్నతాధికారి సంతకాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే పెండింగ్ లో ఉన్న అగ్రిమెంట్ పేపర్లపై సంతకాల పెట్టాలని శాఖ ఉన్నతాధికారిని కిందిస్థాయి అధికారి కోరగా గతంలో సంతకాల పెట్టిన 1300 అగ్రిమెంట్లకు సంబంధించిన కమిషన్ సంగతి తెలిస్తే తప్ప మిగిలిన అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేసే ప్రసక్తి లేదని తేల్చేసినట్లు సమాచారం. అయితే కింది అధికారులు ఆ అంశంపై తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. 1300 అగ్రిమెంట్లకు కమిషన్ సొమ్ము రూ.5లక్షలకు పైగానే ఉంటుంది. ఆ సొమ్ము విషయంలోనే అధికారుల మధ్య పంచాయతీ నడుస్తున్నట్లు, దానివల్లే మిగతా అగ్రిమెంట్లను సంతకాలు కావట్లేదని సంబంధిత శాఖ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి...






