ఉపాధి హామీ పనుల్లో భారీ అక్రమాలు

by Batti.Sumithra |

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు అందరికీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఉపాధి హామీ పనుల్లో భారీ అక్రమాలు
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు అందరికీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం లక్ష్య సాధనకు పని చేయాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కుతుండటంతో భారీగా ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి పనిని పర్యవేక్షించాల్సిన కొందరు అధికారులు మధ్యవర్తులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా నిధులు డ్రా చేస్తున్నట్లు సోషల్ ఆడిట్‌లో వెల్లడైంది. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలంలోని 31 గ్రామపంచాయతీల్లో సోషల్ ఆడిట్ బృందం నిర్వహించిన తనిఖీల్లో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

ప్రతి గ్రామంలోనూ అసలు పనులే జరగలేదంటే అతిశయోక్తి కాదని ఆడిట్ బృందం స్పష్టం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సోషల్ ఆడిట్‌లోనే ఈ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి రావడం గమనార్హం. నిరంతర పర్యవేక్షణ జరిగితే మరెన్ని అక్రమాలు బయటపడతాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పనులు చేయకుండానే నిధుల డ్రా !

మండల పరిధిలోని లచ్చమ్మగూడెం గ్రామపంచాయతీలో హార్టికల్చర్ విభాగంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద కొబ్బరి, నిమ్మ మొక్కలు నాటినట్లు చూపించి బిల్లులు డ్రా చేశారు. అయితే తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానికుల నుంచి వివరాలు సేకరించగా అక్కడ ఎలాంటి పనులు జరగలేదని గుర్తించారు. గ్రామసభలో కూడా సదరు వ్యక్తులు తాము పనులు చేయలేదని ఒప్పుకున్నట్లు వెల్లడైంది. అయితే ఐదు రోజుల తర్వాత మండల స్థాయిలో ఏర్పాటు చేసిన సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంలో అదే వ్యక్తులు తాము తిరిగి పని చేశామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఐదు రోజుల్లో అధికారులు వారిని బలవంతంగా ఒప్పించి అలా చెప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రామంలో వెలుగు చూసిన అక్రమాలు మచ్చుకు కొన్ని

గ్రామపంచాయతీ పరిధిలో జాబ్ కార్డు కలిగిన ఓ వ్యక్తి 11 రోజులు పనిచేసినట్లు మస్టర్లలో నమోదు కాగా, కేవలం 6 రోజులకే చెల్లింపులు చేశారు.

జాబ్ కార్డుల అప్డేషన్ ఎప్పటికప్పుడు జరగడం లేదు.

ఉపాధి హామీ పనులపై ఉన్నతాధికారులు నిర్వహించాల్సిన రోల్ కాల్ కూడా జరగలేదు.

హార్టికల్చర్ కింద నాటిన మొక్కల్లో కేవలం 60 శాతం మాత్రమే బ్రతికి ఉన్నాయి.

ఓ వ్యక్తి మొక్కలు నాటకుండానే కొబ్బరి చెట్లకు బిల్లులు డ్రా చేసినట్లు గుర్తించారు.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు పై రూ.34,223 ఎలాంటి కొబ్బరి మొక్కలు నాటకుండానే డ్రా చేసినట్లు తేలింది.

పలు పనుల నిమిత్తం జీపీ ఖాతాకు వెళ్లాల్సిన నిధులు టెక్నికల్ అసిస్టెంట్ ఖాతాకే జమ అయినట్లు నిర్ధారణైంది.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమిలో పని జరిగినట్లు చూపించి రూ.43,354 డ్రా చేశారు. మస్టర్లలో ఉన్న జాబ్ కార్డు దారులు అసలు గ్రామంలోనే నివసించని వారు అని గ్రామసభలో తెలిపారు. 70 ఏళ్లకు పైబడిన లేవలేని వృద్ధుడికి హాజరు వేసినట్లు తేలింది.

ఇద్దరి పేర్ల పై సుమారు రూ.33,000 విలువైన నిమ్మ తోటల పనులు చూపించి లొకేషన్ మార్చి ఫోటోలు సమర్పించినట్లు గుర్తించారు.

ఒకరి జాబ్ కార్డు పై మరొకరు పని చేసి లక్షల్లో నిధులు డ్రా చేసినట్లు తేలింది.

ఫీల్డ్ అసిస్టెంట్ సంతకం చేయాల్సిన మస్టర్ల పై గ్రామపంచాయతీ కార్మికుడు సంతకాలు చేసినట్లు గుర్తించారు.

రేషన్ డీలర్ కూడా పని చేసినట్లు చూపించి ఆయన జాబ్ కార్డు పై నిధులు డ్రా చేసినట్లు వెల్లడైంది.

ఇవన్నీ తనిఖీ బృందాలు ఏడాది తర్వాత నిర్వహించిన ఆడిట్‌లో బయటపడిన నిజాలు మాత్రమే. స్థానికంగా ఉన్న పర్యవేక్షక అధికారులు అండగా ఉండకపోతే ఈ అక్రమాలు సాధ్యమయ్యేవి కావని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఒక్క గ్రామంలోనే రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు అక్రమాలు జరిగి ఉండవచ్చని స్థానికుల అంచనా.

ఆకస్మిక తనిఖీలు చేస్తే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో !

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సోషల్ ఆడిట్‌లోనే ఈ స్థాయిలో అక్రమాలు బయట పడితే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తే మరెంత దారుణాలు వెలుగులోకి వస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ ఆడిట్ బృందాలు వచ్చే ముందు సమాచారం తెలిసిన వెంటనే అధికారులు మస్టర్లు సిద్ధం చేసుకున్నా కూడా ఈ స్థాయి అక్రమాలు బయటపడ్డాయి. గత సంవత్సరం పనులకు సంబంధించిన ఫోటోలను ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో చూపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనుల వివరాలను అప్పటికప్పుడు నమోదు చేయకపోవడంతోనే తనిఖీ బృందాలు గ్రామానికి చేరుకున్న తర్వాత హడావుడిగా ఫోటోలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే క్రమంలో కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చని సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంలో వివరణ ఇచ్చారు.

Next Story