ఎంపీటీసీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు అనాసక్తి.. అభ్యర్థుల కోసం వెతుకుతున్న పార్టీలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపీటీసీగా అవకాశం కల్పిస్తామన్న నాకు వద్దంటే.. నాకు వద్దని కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు సైతం అభ్యర్థులు దొరకడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేని

ఎంపీటీసీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు అనాసక్తి.. అభ్యర్థుల కోసం వెతుకుతున్న పార్టీలు
X

సర్పంచ్,ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. పల్లెలో రాజకీయ సందడి మొదలైంది. ఆశావహులకు దసరా పండగ కలిసివచ్చింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు మాత్రమే జోరుగా ఉన్నారు. ఎంపీటీసీ,జెడ్పీటీసీ పోటీ చేయడానికి చాలా చోట్ల అభ్యర్థులు ముందుకు రావడం లేదు. నాకు వద్దంటే నాకు వద్దు అంటున్నారు. దీంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులను ఎక్కడ వెతకాలని మదనపడుతున్నారు. ఎమ్మెల్యే దగ్గర మాట పోతుందని లోలోపల కుమిలిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు సైతం అభ్యర్థులు దొరకడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేని పదవి కోసం నాయకులతోపాటు యువత కూడా ఆసక్తి చూపడం లేదు. ఎంపీపీ అవకాశం ఉన్న చోట మాత్రమే పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు.-దిశ, మిర్యాలగూడ

దిశ, మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపీటీసీగా అవకాశం కల్పిస్తామన్న నాకు వద్దంటే.. నాకు వద్దని కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు సైతం అభ్యర్థులు దొరకడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేని పదవి కోసం నాయకులతో పాటు యువత కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఎంపీటీసీ పదవుల కోసం అభ్యర్థులను వెతుకులాడాల్సిన పరిస్థితి అన్ని పార్టీలకు కలిగింది. కేవలం మండల పరిషత్ అధ్యక్షునిగా(ఎంపీపీ) అవకాశం ఉన్న చోట మాత్రమే పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పోటీచేసి గెలిచిన, ఓడిన ఉపయోగం లేని పదవిగా గ్రామాలలో ప్రచారం సాగుతుంది. దీంతో అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఎంపీటీసీగా పోటీకి నిరాకరణ

ఇటీవల వచ్చిన స్థానిక ఎన్నికలలో సర్పంచి పదవి కోసం ఆరాటపడుతున్నప్పటికీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు కరువయ్యారు. అందుకు ప్రధాన కారణం ఆ పదవికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడమే. దీంతో ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు. కేవలం మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నుకోవడం కోసమే ఎంపీటీసీ పదవి అవసరం ఉంటుంది తప్ప ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో అభ్యర్థులు వెనకంజ వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ఎంపీటీసీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడం పార్టీలకు తలనొప్పిగా మారింది.

లక్షల ఖర్చు చేసిన ఫలితం శూన్యం

ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారికి సర్పంచి అభ్యర్థి కంటే ఖర్చు ఎక్కువగా వస్తుంది. దీంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాధాన్యత లేని పదవి కోసం అభ్యర్థులు ముందుకు రావడం లేదు. ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు కనీసం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు, బీసీ అభ్యర్థులు అయితే రూ.10 లక్షలునుంచి రూ.15 లక్షలు, జనరల్ కేటగిరి అయితే రూ.15 లక్షలునుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు చేసిన ఎంపీటీసీగా గెలిచినప్పటికీ ప్రాధాన్యత లేకపోవడంతో పోటీకి నిరాకరిస్తున్నట్లు పలువురు రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. ఓడిన గెలిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తాం తప్ప ఎంపీటీసీగా పోటీ చేయమని నాయకులు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం ముందస్తుగా చేపడుతున్న ఎంపీటీసీ ఎన్నికలలో అభ్యర్థులను ఎంపిక చేయడం స్థానిక నాయకులకు తలనొప్పిగా మారనుంది.

అభ్యర్థుల కోసం వెతుకులాడుతున్న పార్టీలు

ప్రభుత్వం మొదటిగా నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు అభ్యర్థులు దొరకక పార్టీలు వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పార్టీ నిబంధనలకు అనుగుణంగా ఓటర్లు, నాయకులు పనిచేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బుకు ప్రాధాన్యం పెరగడంతో డబ్బు లేకుండా పోటీ చేసే పరిస్థితి లేదు. దీంతో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రాధాన్యం లేని పదవి కోసం పాకులాడాల్సిన అవసరం లేదని అభ్యర్థులు ముందుకు రావడం లేదు. కేవలం మండల పరిషత్ అధ్యక్షుడిగా అవకాశం ఉన్న ఎంపీటీసీ స్థానాలలో మాత్రమే అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన చోట్ల అనాసక్తి చూపడంతో పాటు పోటీకి వెనకంజ వేస్తున్నారు. దీంతో పార్టీ నాయకులకు అభ్యర్థులను వెతుకులాడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనడంలో సందేహం లేదు. పార్టీ పరువు కోసం అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Next Story