Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పై జిల్లా నేతల గుర్రు

by Disha Web Desk 12 |
Komatireddy Venkat Reddy  : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పై జిల్లా నేతల గుర్రు
X

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ నియోజకవర్గంలో ఈసారి ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవు భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో తన కోటకు బీటలు వారుతున్న విషయాన్ని గుర్తించడం లేదని నియోజకవర్గంలో భారీగా చర్చ జరుగుతుంది . ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఒకరిద్దరికే ప్రాధాన్యమివ్వడం వల్ల మిగతా వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యత లేదని వాళ్లంతా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రానున్న ఎన్నికల్లో విజయ అవకాశాలపై ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకరిద్దరికే ప్రాధాన్యం..

నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేశారు. ఓడిపోయిన తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత దాదాపు మూడు సంవత్సరాల వరకు నల్లగొండ కేంద్రానికి వచ్చింది చాలా తక్కువ. దాదాపు ఒక సంవత్సర కాలంగా నల్లగొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కార్యకర్తలు కలుసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఖాయమని ఢంకా బజాయించి చెబుతున్న కోమటిరెడ్డికి అనుకున్నంత ఈజీగా విజయం దక్కకపోవచ్చని తెలుస్తోంది. దానికి తీవ్రమైన వర్గ విభేదాలే కారణమని తెలుస్తోంది.

ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో ముగ్గురు ప్రధాన నాయకులు ఉన్నారు. అందులో ఒకరు మాజీ ప్రజా ప్రతినిధి, మరో ఇద్దరు ప్రస్తుతం ప్రజాప్రతినిధులు. మాజీ ప్రజా ప్రతినిధి ప్రస్తుత ప్రజా ప్రతినిధి చెప్పు చేతుల్లో పెట్టుకొని పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నట్లు సమాచారం. కానీ ఆ ప్రజాప్రతినిధికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అందరిలో చర్చ జరుగుతుంది. అయితే పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రజా ప్రతినిధి ఆ మాజీ ప్రజాప్రతినిధికి వ్యతిరేక వర్గీయులుగా ఉన్నారు. దీంతో నల్లగొండ పట్టణంలో పార్టీ రెండుగా చీలిపోయింది. ప్రధాన నాయకులను కార్యకర్తలను కలుపుకోవడంలో కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసింది.

దాని ఫలితంగానే కొంత మంది నాయకులు ఎంపీ కోమటిరెడ్డి ఫోన్ నెంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల నాయకుల మనోభావాలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించలేక పోతే ఇక ఆ నాయకుడు మాట ఎలా వినాలని వాళ్లంతా ఆవేదనలో ఉన్నారని సమాచారం. అందుకే ఫోన్ నెంబర్ ని బ్లాక్‌లో పెట్టారని తెలుస్తోంది. ఇదే రకమైన వర్గ విభేదాలు తిప్పర్తి, కనగల్ మండలాల్లో కూడా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఈ మధ్య కలెక్టరేట్ ఎదుట జరిగిన కాంగ్రెస్ పార్టీ ధర్నాలో కేవలం ఒక వర్గం మాత్రమే భాగస్వామ్యమైనట్లు తెలిసింది.

కోమటిరెడ్డి పై ఆగ్రహంగా బలహీన వర్గాలు..

నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి పై బలహీన వర్గాల నేతలు ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వర్గాలను చిన్నచూపు చూడటం వల్లే అలా ఉన్నట్లు సమాచారం. సుమారు రెండు నెలల క్రితం శాసనసపక్ష నేత విక్రమార్క పాదయాత్రతో నల్లగొండకు చేరుకున్న సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో బలహీన వర్గాలకు చెందిన నాయకులు చెరుకు సుధాకర్, కొండేటి మల్లయ్య, తండు సైదులు గౌడ్, పున్న కైలాస నేతలు వేదిక ఎక్కుతున్న సమయంలో కోమటిరెడ్డి అనుచరుడు ఒకరు ఈ వేదిక మీద " కోమటిరెడ్డి అనుచరులు తప్ప ఎవరు ఎక్కకూడదు దిగిపోవాలి ఇది కోమటిరెడ్డి అడ్డా" అంటూ ఘాటుగా మాట్లాడారు. అంతకు ముందు ర్యాలీలో మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. పాదయాత్రతో నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్‌కు భట్టి విక్రమార్క చేరుకోగానే ఆ మండలంలోని ఒక గ్రామంలో మూడు రోజులు విశ్రాంతి పేరుతో ఉంచారు. తప్ప ఒక్కరోజు కూడా ఆయన్ని కోమటిరెడ్డి కలవలేదు. అంతేకాకుండా నకిరేకల్ నియోజకవర్గంలో కూడా మూడు రోజులు ఉంటే అక్కడా కలిసిన దాఖలాలు లేవు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన పాదయాత్రలో ఎక్కడ కూడా కోమటిరెడ్డి పాల్గొనలేదు. ప్రతిపక్ష నేత ఒక దళితుడు అయినందువల్లే ఎంపీ కోమటిరెడ్డి రాలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం అయింది. కోమటిరెడ్డి నిత్యం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటాడు. ఆయన నల్లగొండలో నిరుద్యోగ గర్జన పేరుతో సభ పెడితే కోమటిరెడ్డి పాల్గొన్నారు. కానీ దళిత నేత సభా కార్యక్రమానికి రాకపోవడంలో అంతరార్థం ఏంటని బడుగు బలహీన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది దళితనేతలపై నకిరేకల్‌కు సంబంధం లేని ఒక సామాజిక వర్గం వారి చేత దాడి చేయించారని కూడా పెద్ద ఎత్తున ప్రచారమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే గత 25 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో గుర్తింపు కరువైందని రానున్న ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గంలో నుంచి బలహీన వర్గాల నాయకుడికి సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బీసీల ఆత్మగౌరవ సదస్సు పేరుతో సభ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు చేశారని వినికిడి..

మునుగోడు ఎన్నికల నుంచి కూడా ఎంపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడికి ఓటేయాలని సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైరల్ కావడం ఆ తర్వాత ఇతర దేశాల నుంచి కూడా అదే రకమైన వాయిస్ సోషల్ మీడియాలో ఇవ్వడం పెద్ద ఎత్తున వైరల్ అయింది. నల్లగొండ , నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులంతా మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేలా వెంకట్ రెడ్డి చేశారన్న విషయం బహిరంగ రహస్యమే. ఇలా అనేక సంఘటనలతో కోమటిరెడ్డిపై ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed