- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీహెచ్‌సీల్లో పర్యవేక్షణ గల్లంతు.. పోచంపల్లిలో వైద్యుడి అవతారమెత్తిన స్వీపర్
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లోపమా.. లేక క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యమా అన్న చందంగా పీహెచ్‌సీల నిర్వహణ సాగుతోంది. గుండాల, భూదాన్ పోచంపల్లి మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల ఉదంతాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విధులకు సమయపాలన పాటించకపోవడం, డ్యూటీ సమయంలో నిద్రపోవడం, కనీస వైద్య పరిజ్ఞానం లేని స్వీపర్లతో రోగులకు చికిత్సలు చేయిస్తుండటం చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డ్యూటీ టైమ్‌లో నిద్రపోతూ..
గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తీరు అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేవారే లేరు అన్నట్లుగా మారింది.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉండగా, నిబంధనలను బేఖాతరు చేస్తూ 10 దాటినా ఆసుపత్రి మొహం చూడటం లేదు. తీరా వచ్చినా ఆసుపత్రిలో డ్యూటీ సమయంలోనే హెల్త్ సూపర్ వైజర్లు నిద్రిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వైద్యాధికారి ఎక్కడా అని విచారించగా, ఇంటికి వెళ్లారని కొందరు.. కలెక్టరేట్ లేదా డీఎంహెచ్‌ఓ ఆఫీసులో మీటింగ్‌కు వెళ్లారని మరికొందరు సిబ్బంది పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. ఒకరు ఉంటే మరొకరు ఉండని పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఇటీవలే డిప్యూటీ డీఎంహెచ్వో పీహెచ్ సీని తనిఖీ చేసి, సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
డాక్టర్ లేకుంటేనేం.. మేమున్నాం కదా..
మరోవైపు భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఆసుపత్రుల్లో వైద్యులు కానీ, క్వాలిఫైడ్ నర్సులు కానీ డ్రెస్సింగ్ చేయాల్సి ఉండగా.. ఇక్కడ మాత్రం ఏకంగా స్వీపరే డాక్టర్ అవతారమెత్తారు. పట్టణ కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి రాగా, అక్కడ నర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ కనీస వైద్య పరిజ్ఞానం లేని స్వీపర్ సదరు రోగి తలకు బ్యాండేజ్ కడుతూ కనిపించింది. దీనిపై ప్రశ్నించగా మేము రోజూ చేసేది ఇదే.. గ్లూకోజ్‌లు కూడా మేమే పెడతాం.. మాకు అలవాటైపోయింది అంటూ ఆమె ధీమాగా సమాధానం ఇవ్వడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. గతంలో నవంబర్ 2019 లో కూడా ఇదే పోచంపల్లి పీహెచ్‌సీలో స్వీపర్ చేసిన డ్రెస్సింగ్ వికటించి ఒక రోగి ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయిందని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం..
ఈ రెండు పీహెచ్‌సీల ఘటనలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వైద్యాధికారులు మీటింగుల పేరుతో జిల్లా కేంద్రానికి వెళ్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురుచూసి, చేసేదేమీ లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పోచంపల్లి ఘటనపై విచారిస్తున్నాం
భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీపర్ రోగికి డ్రెస్సింగ్ చేసిన ఘటనపై విచారణ చేస్తున్నాం.. అని డీఎంహెచ్‌ఓ మనోహర్ తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం జరుపుతున్నామని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. డ్యూటీ టైంలో పీహెచ్ సీల సిబ్బంది, డాక్టర్లు ఆసుపత్రికి వచ్చిన పెషెంట్లకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలని సూచించారు.






