మిర్యాలగూడలో ఐపీఎల్ బెట్టింగ్ ‘జోరు’.. దాబాలు, సిట్టింగ్‌లే అడ్డాలు

by Malleboina Mahesh |

మిర్యాలగూడలో ఐపీఎల్ బెట్టింగ్ దందా! దాబాలు, సిట్టింగ్ కేంద్రాల్లో లక్షల రూపాయల పందేలు. అప్పుల ఊబిలో యువత.. పోలీసుల నిఘాపై విమర్శలు.

మిర్యాలగూడలో ఐపీఎల్ బెట్టింగ్ ‘జోరు’.. దాబాలు, సిట్టింగ్‌లే అడ్డాలు
X

దిశ , మిర్యాలగూడ టౌన్: క్రీడలు అంటే ఒకప్పుడు ఆనందంగా గడపడం..ఆహ్లాదం పంచడం.. ఆస్వాదించడం.. కానీ ఇప్పుడు ఐపీఎల్ అంటే బెట్టింగ్ అన్నట్లుగా మారింది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) క్రికెట్ ఫీవర్ రాష్ట్రంలో బాగుంది. దీంతో ఆటలో ఆనందం కంటే బెట్టింగ్ కు ప్రాధాన్యం పెరిగింది. ఆన్ లైన్ బెట్టింగ్ తో పాటు ఆఫ్ లైన్ మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలలో జోరుగా సాగుతోంది. లక్షలాది రూపాయాలు రాత్రికి రాత్రి చేతులు మారుతున్నాయి. క్రికెట్ అంటేనే బెట్టింగ్ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. లక్షల రూపాయాలు వెచ్చించి బెట్టింగ్ లో పాల్గొని అప్పుల పాలైతున్న సంఘటనలు ఉన్నాయి. ఈ పెనుభూతం పడగ విప్పి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తుంది.

మిర్యాలగూడ‌లో క్రికెట్ బెట్టింగ్ అడ్డాగా మారుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో కొందరు వ్యక్తులు బెట్టింగ్ నిర్వహణ సాగిస్తున్నారని సమాచారం. ఈ బెట్టింగ్ ముఖ్యంగా హోటల్స్ , మద్యం సిట్టింగ్, దాబాల వద్ద నిర్వహస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అద్దంకి రహదారిపై ఉన్న దాబాలు వద్ద రాత్రి వేళ ప్రోజెక్టర్ ద్వారా స్క్రీన్ లు ఏర్పాటు మ్యాచ్ లు ప్రదర్శిస్తున్నారు. దీంతో యువకులు దాబాల్లో ,హొటల్స్ ,మద్యం సిట్టింగ్ ల వద్ద మ్యాచ్‌లను తిలకిస్తూ బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు.

అంతేకాకుండా దాబా ల వద్ద మద్యం తాగుతూ క్రికెట్ చూస్తూ బెట్టింగ్ లో హంగామా చేస్తున్నట్లు తెలిసింది.ఇటీవల క్రికెట్ చూస్తూ మద్యం మత్తులో ఘర్షణ పడగా పోలీసుల దృష్టి కి వెళ్లినట్లు సమాచారం. మ్యాచ్ ప్రారంభంలో గెలుపు ఓటమిల కు సంబంధించి రేటింగ్‌ను గెలిచే జట్టును బట్టి రూ.1000 కి 1200 ,రెటింగ్ తక్కువ ఉన్న జట్టుకు రూ. 500 లకు రూ.700 చోప్పున బెట్టింగ్ సాగిస్తున్నారు. ప్రతి రోజు లక్షలాది రూపాయలు బెట్టింగ్ లో డబ్బు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

తీవ్రంగా నష్టపోతున్న యువత..

ఒకవైపు ఆన్ లైన్ యాప్ ల ద్వారా రుణాలు పొంది తీర్చలేక అత్మహత్యల సంఘటనలు జరుగుతున్నపటికీ బెట్టింగ్ భూతం వైపు యువత మొగ్గు చూపుతున్నారు. ఈ క్రికెట్ లో అధిక సంఖ్యలో యువత పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు యువకులు తమ వద్ద డబ్బులు అయిపోయి బంగారం , వాహనాలను తాకట్టుపెట్టి బెట్టింగ్ కు బానిసలుగా మారుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో లక్షల రూపాయలు బెట్టింగ్ లో పెట్టి నష్టపోతున్నారు.

నామా మాత్రంగా పోలీసుల నిఘా ?

మిర్యాలగూడ పట్టణం తో పాటు పరిసర గ్రామాల లో సైతం బెట్టింగ్ నిర్వహణ సాగుతుంది. అయితే బెట్టింగ్‌లపై నిఘా పెంచాల్సిన పోలీసులు నామా మాత్రంగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పట్టణంలో ఉన్న హోటల్ , దాబాలు రాత్రి 12 గంటలకు మూసివేయాలని గట్టి గస్తీ నిర్వహణ చేస్తున్నప్పటికీ బెట్టింగ్ పై దృష్టి సారించడంలో జాప్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బెట్టింగ్ తో పాటు రాత్రి వేళ గంజా కూడా తాగి మత్తుకు యువత బానిసలైతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.ఇప్పటికైన పోలీసులు నిఘా పెంచి బెట్టింగ్ కు పాల్పడుతున్న నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story