చెరువు మట్టి దోపిడి..? అనుమతులు లేకుండా తవ్వకాలు..!

by Bhanu |

అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో పల్లెల్లో మట్టి వ్యాపారం జోరుగా సాగుతుంది. మట్టి మాత్రమే కదా అనుకుంటే పొరపాటే. ఆ మట్టితోనే కొంతమంది అక్రమ వ్యాపారులకు బంగారం పంట పండుతుంది.

చెరువు మట్టి దోపిడి..? అనుమతులు లేకుండా తవ్వకాలు..!
X

దిశ, భూదాన్ పోచంపల్లి: అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో పల్లెల్లో మట్టి వ్యాపారం జోరుగా సాగుతుంది. మట్టి మాత్రమే కదా అనుకుంటే పొరపాటే. ఆ మట్టితోనే కొంతమంది అక్రమ వ్యాపారులకు బంగారం పంట పండుతుంది. గత కొన్ని రోజులుగా ఈ దందా జరుగుతున్నప్పటికీ మండల స్థానిక అధికారులు కూడా ఎవరు అటువైపు కన్నెత్తి చూడటం లేదు అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకునే దిక్కులేకుండా పోయింది. మండలంలోని కప్రాయపల్లి గ్రామంలో ఉన్న ఒక చెరువులో దాదాపు రెండు నెలలుగా మట్టిని తరలిస్తున్నారు. చెరువులో నుంచి రోజుకు పది టిప్పర్లు చెరువు మట్టిని బయటికి తరలిస్తున్నారు. ఒక్క టిప్పర్ కనీసం 10 ట్రిప్పులను చెరువు మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన చూస్తే సుమారు 100 ట్రిప్పుల మట్టి అక్రమంగా బయటకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక ట్రిప్పు మట్టికి రూ.7వేలు..

చెరువుల మట్టి ఇటుకలు తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది అందుకే దానికి చాలా ఖరీదు కలిగి ఉంటుంది. రోజుకు సుమారు 100 ట్రిప్పుల మట్టిన చుటు పక్కల ప్రాంతాలలో తయారుచేసే ఇటిక బట్టిలకు వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్క ట్రిప్పు విలువ సుమారు రూ.7వేలు.. ఆ లెక్కన రోజు 100 ట్రిప్పులు బయటికి తరలిస్తున్న మట్టి విలువ దాదాపు రూ.7లక్షలు అవుతుంది. రోజు రూ.7లక్షలు అయితే నెలకు రూ.2 కోట్ల పైచిలుకు మట్టి వ్యాపారం జరిగినట్లు తెలుస్తుంది..

మామూళ్ల మత్తులో అధికారులు..?

చెరువులో నుంచి మట్టి తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడం లేదు. మట్టి వ్యాపారులు అధికారులకు మామూళ్లు అందజేయడం వల్లే అధికారులు ఆ వైపు కూడా రావట్లేదనేది చర్చ జరుగుతుంది. మట్టి తరలింపు విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ అధికారి దృష్టికి తీసుకెళ్లగా"" మేము కూడా గమనిస్తున్నాం ..మరో రెండు రోజుల్లో తరలింపు నిలిపివేస్తాం"" అంటూ సెలవిచ్చారు తప్ప ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు... అక్రమ మట్టి తరలింపు విషయమై ఇరిగేషన్ అధికారులను సంప్రదించి ప్రయత్నం చేయగా కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు... ఇప్పటికైనా అధికారులు చెరువు మట్టి తరలిస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు


Next Story