ట్రస్ట్ నుంచి నిలిచిన ఆర్థిక వ్యవహారాలు.. కాలేజ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

by Dishanational4 |
ట్రస్ట్ నుంచి నిలిచిన ఆర్థిక వ్యవహారాలు.. కాలేజ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
X

దిశ,చండూరు: మండల పరిధిలోని మంచికంటి యాదగిరి జూనియర్ కళాశాలకు ట్రస్ట్ నుండి ఆర్థిక వ్యవహారాలు నిలిచిపోయాయని, దాంతో కళాశాలను మూసివేసే ప్రయత్నం జరుగుతుందని కళాశాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద విద్యార్థులకు భరోసా కల్పించాలని కోరుతూ శుక్రవారం పేరెంట్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ వేల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను నేర్చుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారని, ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడ్డారని అన్నారు.

అనేక మంది గ్రాడ్యుయేట్‌లు విద్యను అభ్యసించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉన్నారని అన్నారు. నేడు ఆ ట్రస్ట్‌కు ఆర్థిక కార్యక్రమాలు నిలిచిపోవడం వలన ఉచిత విద్యను కొనసాగించడానికి మేనేజ్మెంట్ ఇబ్బంది పడి కళాశాలను తీసివేసే ప్రయత్నం జరుగుతోందని, మునుగోడు చండూరు మండలాల వందలాది మంది విద్యార్థులు చదువుకు నష్టపోయే పరిస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ కార్యక్రమంలో మంచికంటి జూనియర్ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి జడిగల కళమ్మ, బొమ్మల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story