నల్లగొండ రింగ్ రోడ్డుకు ‘బంక’ పట్టు

by Malleboina Mahesh |

ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేపడుతుంది. అందులో భాగంగానే నల్లగొండ పట్టణం చుట్టూ కూడా రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుంది.

నల్లగొండ రింగ్ రోడ్డుకు ‘బంక’ పట్టు
X

నల్లగొండ పట్టణ ప్రజల చిరకాల స్వప్నమైన రింగ్ రోడ్డు నిర్మాణం ప్రస్తుతం వివాదాలకు నిలయంగా మారింది. సుమారు రూ.516 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. నిబంధనల ప్రకారం నాణ్యమైన మట్టిని వాడాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చౌడు, నల్ల బంక మట్టిని ఉపయోగిస్తూ పనులు కానిచ్చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పనుల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం వాటర్ క్యూరింగ్ కూడా చేయకుండానే రోడ్డు పనులు పూర్తి చేస్తుండడంతో భవిష్యత్తులో ఈ రహదారి భారీ వాహనాల తాకిడికి త్వరగా కుంగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రజాధనం అడ్డగోలుగా దుర్వినియోగం అవుతున్నా కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారు కరువయ్యారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ బ్యూరో, నల్లగొండ : ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేపడుతుంది. అందులో భాగంగానే నల్లగొండ పట్టణం చుట్టూ కూడా రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుంది. కానీ ఈ పనుల్లో నాణ్యత లోపించింది. ఈ రోడ్డు నిర్మాణంలో పాటించాల్సిన నిబంధనలు గాలికి వదిలేశారు. కనిపించని అధికారుల పర్యవేక్షణ.. కాంట్రాక్టర్లు అధికారుల కుమ్మక్కుతో రోడ్డు పనులు పూర్తిగా లోపభూయిష్టంగా జరుగుతున్నాయి.

రింగ్ రోడ్డు కోసం రూ. 516 కోట్లు..

నల్లగొండ పట్టణం చుట్టూ ప్రభుత్వం రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుంది. నల్గొండ పట్టణంలోని పానగల్ సమీపంలో ఉన్న చాయ సోమేశ్వర ఆలయం నుంచి కూడా జంక్షన్, మునుగోడు హౌసింగ్ బోర్డ్, కతాల్‌గూడెం, మెడికల్ కాలేజీ వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. సుమారు 14 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన రైతులకు పరిహారం, రోడ్డు నిర్మాణం కోసం మొత్తం కలిపి రూ.516 కోట్లతో పనులు చేపట్టారు. ఈ నిర్మాణంలో కల్వర్టులు 30, రోడ్డు మైనర్ బ్రిడ్జిలు-2, రోడ్డు ఓవర్ బ్రిడ్జి-1, మూడు అండర్ పాస్‌లు-3, ఫ్లై ఓవర్ -1 నిర్మాణం చేస్తున్నారు. 2025 అక్టోబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించారు. కాంట్రాక్ట్ పనులు ఎస్ఎల్ఎంఐ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకున్నారు. 2027 అక్టోబర్ 6 తేదీ వరకు రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్ చేశారు.

రోడ్డు పనుల్లో కనిపించని నాణ్యత...

‘పని జరిగితే చాలదా... ఏ మట్టి అయితే ఏమైతదీ.. అయినా మా కాంట్రాక్టర్ సార్.. అధికారులు చూసుకుంటారు. మీకేం పని.’ అంటూ రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్న సంస్థలో పని చేసే సూపర్ వైజర్ మాట్లాడిన తీరు ఇది. దీన్నిబట్టి ఎంత నాణ్యతగా పనులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే మట్టిలో పూర్తిగా చౌడు మట్టి, నల్ల బంకమట్టిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. పానగల్ సమీపంలోని కాలువ నుంచి తీసుకొచ్చి రోడ్డుకు వేస్తున్నారు. మట్టి పూర్తిగా బంకతో కూడిన చౌడు మట్టి తీసుకొచ్చి పనులు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆ మట్టి తీసుకురావడానికి మైనింగ్ శాఖ ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది.

అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా పొలాల నుంచి వస్తున్న నల్ల బంక మట్టిని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డుపై కంకర, డస్ట్ తప్ప మరొకటి వాడడం లేదు. దీనివల్ల భారీ వాహనాలు నడిచే ఈ రోడ్డు అంత నాణ్యత లేకుండా తొందరగా కుంగి పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే రోడ్డు నిర్మాణంలో వాటర్ క్యూరింగ్ చాలా అవసరం. కానీ ఈ రింగ్ రోడ్డుకు మాత్రం క్యూరింగ్ కూడా సర్కారీ నిర్వహించట్లేదని విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి నిబంధనలకు పాతరేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

పర్యవేక్షణ చేసే అధికారులెక్కడ..?

రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా జరుగుతున్నాయా.. లేదా? పర్యవేక్షణ చేయడానికి సంబంధించిన అధికారులు జిల్లాలో ఉన్నప్పటికీ రింగ్ రోడ్డు పనులను మాత్రం ఏమాత్రం పరిశీలించట్లేదని తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఏ మట్టి రోడ్డు కోసం వాడాలో, ఏది వాడకూడదో తెలిసీ కూడా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. పనులు జరుగుతున్న చోటుకు అధికారులు రావడం లేదని సమాచారం. అధికారులు వాటిని పర్యవేక్షించి పనులు నాణ్యతగా జరిగేలా చూడకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం. కమీషన్ల కోసం పనిచేస్తున్న అధికారులు కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులు ఒత్తి ప్రభుత్య ధనం మెక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారమే పనులు..

ఔటర్ రింగ్ రోడ్డు పనులు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి. నాణ్యతతో కూడిన నిర్మాణం జరుగుతోంది. పనుల్లో ఎలాంటి అక్రమాలకు చోటు లేదు.:- సాయి కుమార్, ఏఈ

Next Story